మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. రూ.300 కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపంతో అన్న.. తమ్ముడిపై దాడి చేశాడు. దీంతో అతడు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్ జిల్లాలో ఇద్దరు సోదరుల మధ్య రూ.300 కోసం వివాదం చెలరేగింది. రమేశ్ కకోడియా అనే వ్యక్తి తన తమ్ముడు సుమన్ సింగ్ కకోడియా భార్య వద్ద రూ. 300 అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరు సోదరులు మధ్య గొడవ జరిగింది. అయితే కోపంలో ఉన్న రమేశ్.. సుమన్ తలపై పైపుతో గట్టిగా కొట్టాడు. దీంతో సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన సుమన్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. గొడవ జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని మరో వ్యక్తి తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
మైనర్‌ను హత్య చేసిన యువకుడు
రాజస్థాన్‌లోని జాలోర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కారణంతో.. ఓ మైనర్‌ను హత్య చేశాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఆహోర్ ప్రాంతానికి చెందిన హజారిలాల్ హరిజన్ అనే 22 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో తిరిగేవాడు. కానీ, ఆ అమ్మాయి అతడిని పట్టించుకోలేదు. దీంతో అమ్మాయిపై కోపం పెంచుకున్న హజారిలాల్.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
మంచి నీటిశుద్ధి కర్మాగారంలో శరీర భాగాలు..
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోటర్పుర్ ప్రాంతంలో ఉన్న మంచినీటి శుద్ధి కర్మాగారంలో ఉన్న వ్యాటర్ ట్యాంక్‌లో కొన్ని శరీర భాగాలు కనిపించాయి. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరప్రాంతాలకు మంచినీటిని అందించడానికి ముందు ఓ ఉద్యోగికి.. వాటర్ ట్యాంక్‌లో తేలియాడుతూ కాళ్లు, చేతులు, తల భాగాలు కనిపించాయి. వెంటనే అతడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే వారు నగరానికి చేరే నీటి సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న.. ఆ శరీర భాగాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికు తరలించారు. మున్సిపల్ సిబ్బంది వెంటనే ఆ ట్యాంక్‌లో ఉన్న 1.5 కోట్ల లీటర్ల నీటిని నర్మదా నదిలో విడిచిపెట్టారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
టాయిలెట్‌కు వెళ్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో హత్య
ముంబయిలో దారుణం జరిగింది. బస్టాండ్ ఎదురుగా పబ్లిక్ టాయిలెట్‌ను ఉపయోగించి డబ్బులు ఇవ్వలేదనే విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాహుల్ పవార్ అనే వ్యక్తి బస్టాండ్ ఎదురుగా ఉన్న పబ్లిక్ బాత్రూమ్ను ఉపయోగించాడు. అతడు డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతుండగా అక్కడ పనిచేసే విశ్వజీత్ అనే కేర్‌టేకర్ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంతో విశ్వజీత్.. రాహుల్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుల్ని బంధించిన పెళ్లి బృందం
సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఓ పెళ్లి బృందం కొంత మంది యువకులని గొలుసులతో బంధించారు. కోల్డ్ స్టోరేజ్‌లో ఏకంగా 12 గంటలపాటు ఉంచి నరకం అంటే ఎంటో చూపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి యువకులను రక్షించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..కమల్‌గంజ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం వివాహం జరిగింది. అక్కడ ఫరూఖాబాద్, కమల్‌గంజ్‌కు చెందిన కొంతమంది యువకులు వైయిటర్లుగా చేరారు. పెళ్లికి వచ్చిన నితీశ్, మహేశ్వరి అనే దంపతుల మొబైల్‌ఫోన్ చోరీకి గురైంది. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో అక్కడ పనిచేస్తున్న వెయిటర్లపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ హౌస్ యజమానితో కలిసి నితీశ్, మహేశ్వరి రాత్రి 12 గంటల సమయంలో ఐదుగురు వెయిటర్లను పట్టుకున్నారు. అనంతరం కోల్డ్ స్టోరేజ్‌కి తీసుకొచ్చి కాళ్లు, చేతులను గొలుసులు బిగించి తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడం వల్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు కూడా వీళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.