తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలను మోసం చేయడమే కాంగ్రెస్​ పని.. 50ఏళ్లుగా అదే అబద్ధం : మోదీ - నరేంద్ర మోదీ కామెంట్స్​

PM Modi Rajasthan Visit : పేదలను తప్పుదోవ పట్టించే విధానాలను కాంగ్రెస్ అవలంబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. 50 ఏళ్ల క్రితం పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి దాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజస్థాన్‌లోని బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

modi
modi

By

Published : May 31, 2023, 9:51 PM IST

PM Modi Rajasthan Visit : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీపై మండిపడ్డారు. పేదరిక నిర్మూలన నినాదం దశాబ్దాలుగా ఆ పార్టీ చెబుతున్న అతిపెద్ద అబద్ధమని మోదీ విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నెల రోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని అజ్మేర్​లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు.

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేసిందని ఆయన అన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ రిమోట్ పాలనలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో ఉండేవారని, ప్రధాన నగరాలేమో తీవ్రవాద దాడులకు గురయ్యేవని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ తన హయాంలో అవినీతి వ‌్యవస్థను వృద్ధి చేసి అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందని ధ్వజమెత్తారు.

'పేదరికం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించింది'
Modi On Congress : "దేశంలో పేదరిక నిర్మూలన చేస్తామని కాంగ్రెస్ పార్టీ.. 50 ఏళ్ల నుంచి హామీలు ఇస్తోంది. పేదలను ప్రతిసారీ అలా చెబుతూ ఆ పార్టీ మోసం చేస్తోంది. నిజానికి పేదలకు ద్రోహం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. పేదరికం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించింది. రాజస్థాన్‌ సహా దేశంలోని ఎంతో మంది ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ఇబ్బందులకు గురయ్యారు. 2014 ముందు కాంగ్రెస్‌ పెంచి పోషించిన అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు" అని ప్రధాని విమర్శించారు.

'బీజేపీ పాలనతో ప్రపంచం మొత్తం భారత్‌ గురించి మాట్లాడుకుంటోంది'
దేశంలో అభివృద్ధి పనులకు బీజేపీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారని మోదీ తెలిపారు. "కమలం పార్టీ పాలనలో దేశంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత అనేది ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి వ్యవస్థతో దేశాభివృద్ధిని అడ్డుకుంది. కానీ బీజేపీ ప్రభుత్వం తన 9 ఏళ్ల పాలనలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సుపరిపాలనను అందిస్తుంది. పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ పాలనతో ప్రపంచం మొత్తం భారత్‌ గురించి మాట్లాడుకుంటోంది. త్వరలోనే భారత్‌లో పేదరికం అంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు" అని ప్రధాని మోదీ అన్నారు.

Rajasthan Elections 2023 : 2023 చివర్లో రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సభ.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి నాందిగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ సీనియర్​ నేత అశోక్‌ గహ్లోత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.

ABOUT THE AUTHOR

...view details