Best Tips to Driving at Foggy Weather : దేశమంతటా రోజురోజుకు చలి పెరిగిపోతోంది. దీనికితోడు చాలా చోట్ల దట్టమైన పొగమంచు మరింత ఇబ్బంది పెడుతోంది. ఉదయం, సాయంత్రం సమయంలో డ్రైవింగ్(Driving) చేసేవారికి ఇది ప్రాణసంకటంగా మారుతోంది. కాబట్టి ఈ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా ఇలాంటి సందర్భాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ సమయంలో మీరు రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ టిప్స్ పాటించారంటే.. పొగమంచు వల్ల కలిగే సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
లో బీమ్ లైట్లనే వినియోగించాలి :పొగమంచు కురుస్తున్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది డ్రైవర్లు సరైన అవగాహన లేకపోవడంతో హైబీమ్ లైట్లను వినియోగిస్తుంటారు. ఎందుకంటే అవి ఎక్కువ కాంతినిస్తాయని భావిస్తారు. కానీ, ఈ హైబీమ్ లైట్ల కారణంగా వచ్చే కాంతి పొగమంచులో కలిసిపోతుందనే విషయం మర్చిపోతారు. అదే లోబీమ్ లైట్లను వినియోగిస్తే.. ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ వాహనం ఎక్కడ ఉందో ఈజీగా తెలుస్తుంది. ఫలితంగా వారు ముందుగా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమయాల్లో మీ వాహనంలో ఫాగ్ లైట్లు వస్తే వాటిని ఆన్‌లో ఉంచాలి. ఇవి కూడా చాలా వరకు ప్రమాదాల నుంచి సురక్షితంగా కాపాడతాయి.
వార్నింగ్ లైట్ ఆన్ చేసుకోవాలి :దట్టమైన పొగమంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వార్నింగ్ లైట్‌ను ఆన్ చేసుకొని ప్రయాణించడం బెటర్. ఫలితంగా మనకు ఎదురుగా, వెనుక వైపు వచ్చే వాహనదారులు మన వాహనం డైరెక్షన్ గుర్తించే అవకాశం ఉంటుంది.
నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి :ఈ సమయంలో అతివేగం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తక్కువ విజిబిలిటీ కారణంగా, ఏదైనా వాహనం ఒక్కసారిగా మీ ముందు కనిపించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదం చోటుచేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం మంచిది.
హెచ్చరికలను ఫాలో అవ్వాలి : ప్రస్తుతం చాలా వరకు రాష్ట్ర, జాతీయ రహదారులపై రేడియం లైటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి రోడ్లను రెండుగా విభజిస్తున్నాయి. అలాగే బ్రిడ్జి, ఇరుకైన రోడ్ల వద్ద అదనపు రేడియమ్ లైటింగ్, తెలుపు, పసుపు రంగుల్లో వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నారు. అయితే వీటిని సరిగా అనుసరించడం ద్వారా కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
డ్రైవింగ్ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్‌తో దూసుకెళ్లండి!