Best Tips for Online Bus Ticket Booking : ఒకప్పుడు ఎక్కడికైనా బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే బస్టాండ్‌కు వెళ్లి టికెట్ కౌంటర్ వద్ద క్యూలో నిల్చోని టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రైలు టికెట్స్ అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నామో అదే విధంగా బస్(Bus) టికెట్స్ బుక్ చేసుకోవడానికి పలు వెబ్‌సైట్స్ వచ్చాయి. అయితే చాలా మంది బుకింగ్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోతుంటారు. మరీ ముఖ్యంగా పండగల సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాకాకుండా ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. మీ ప్రయాణం సురక్షితంగా సాగడంతో పాటు చాలా తక్కువ ధరకే టికెట్ పొందవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సురక్షితమైన వెబ్సైట్ ఎంచుకోవడం :ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు సరైన బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఎంచుకోకపోవడం. కొన్ని సైబర్ ముఠాలు దీనిని క్యాష్ చేసుకుంటాయి. దాంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాకాకుండా ఉండాలంటే మీరు సురక్షితమైన బస్ టికెట్ బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ ఎంచుకోవాలి.
రేటింగ్‌లు, సమీక్షలను వీక్షించడం :ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్‌కు ముందు చేయాల్సిన మరో పని ఏంటంటే.. మీరు టికెట్ బుక్ చేయాలనుకుంటున్న వెబ్సైట్ లేదా యాప్‌లో దానికి సంబంధించిన రేటింగ్స్, రివ్యూలు చదవడం. తద్వారా దాని గురించి గత ప్రయాణికులు ఇచ్చిన సమాచారం తెలుస్తుంది. అది మీరు సరైన బస్ బుకింగ్ పోర్టల్ ఎంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి చెక్ చేయడం ద్వారా దానిలో ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయి. అప్పుడు అది సురక్షిమైనదా? కాదా? అని ఓ అవగాహన వస్తుంది.
సరిపోల్చడం :ఆన్‌లైన్ బస్ బుకింగ్ ప్రధాన ప్రయోజనాల్లో మరొకటి ఏంటంటే.. ఎప్పుడైనా మీరు బుక్ చేసేటప్పుడు ఇతర బస్సులతో పోల్చి చూసుకోవాలి. అంటే ఎప్పుడూ ఒకే మార్గంలో కాకుండా వివిధ బస్సుల సమయాలు, సేవలను సరిపోల్చడం. అలాగే ఒకదాన్ని బుక్ చేసుకునే ముందు వివిధ బస్సుల ఛార్జీలను పోల్చడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆన్‌లైన్ బస్ టిక్కెట్‌లు చాలా మంది ఆపరేటర్‌లతో అనుసంధానించబడి ఉంటాయి. అలా చేయడం ద్వారా మీకు అందులో తక్కువ ధరకు లభిస్తుంది, దేనిలో త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటాం అనే వివరాలపై అవగాహన వస్తుంది.
ముందస్తు బుకింగ్ : మీరు బస్ టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవడానికే ఆ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ఉంది. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. రేపు ప్రయాణం అంటే ఈ రోజు బుక్ చేయడం. అలాకాకుండా మీరు ముందస్తు బుకింగ్‌ను అలవాటు చేసున్నారంటే సమయం, డబ్బు ఆదా చేయడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే పండగల టైమ్ లేదా సెలవు దినాల్లో అధిక డిమాండ్ & తక్కువ లభ్యత కారణంగా బస్సు ఛార్జీలు పెరగవచ్చు. అలాంటి సమయాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ముందస్తు టికెట్ బుకింగ్ మంచిగా యూజ్ అవుతుంది.