Best Places Visit in November in North India : భారతదేశం విభిన్న సంస్కృతులకే కాదు.. చారిత్రాత్మక ప్రదేశాలకు పెట్టింది పేరు. దేశంలో ఎక్కడికి వెళ్లినా చూడాల్సిన ప్రదేశాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఈ విజ్ఞానంతోపాటు ఉల్లాసం పొందాలంటే.. తరచూ టూర్ వెళ్లడం బెస్ట్ ఆప్షన్. ఈ నవంబరులో గనక టూర్ వెళ్లాలని అనుకుంటే.. నార్త్ ఇండియా టూర్ సూపర్ ఛాయిస్. మరి.. ఈ సమయంలో సందర్శించాల్సిన ప్రదేశాలు ఏంటి? అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Best Places To Visit In North India :ఉత్తర భారత దేశంలో నవంబర్‌లో సందర్శించాల్సిన రాష్ట్రాలు..
1. ఢిల్లీ :భారత దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలి. యమునా నది ఒడ్డున ఉన్న ఈ నగరం గొప్ప సంస్కృతీ, సంప్రదాయలకు, చారిత్రాత్మక ప్రదేశాలకు నిలయం. దేశంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఢిల్లీ ఒకటి. ఇక్కడ ముఖ్యమైన స్మారక చిహ్నాలు, దేవాలయాలు, కోటలు, మార్కెట్‌లు ఉన్నాయి. నవంబర్ నెలలో దిల్లీలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు : రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, లోధి గార్డెన్స్, జామా మసీదు, ఇండియా గేట్, ఛతర్‌పుర్ టెంపుల్, హుమాయూన్ సమాధి, లోటస్ టెంపుల్, అక్షరధామ్ టెంపుల్, పురానా ఖిలా.
చేయాల్సిన పనులు : జన్‌పథ్ స్థానిక మార్కెట్లో షాపింగ్ చేయండి. గార్డెన్ ఆఫ్ సెన్సెస్‌లో సాయంత్రం సేద తీరండి. చాందినీ చౌక్‌లోని స్ట్రీట్ ఫుడ్‌ను ట్రై చేయండి.
- సమీప విమానాశ్రయం : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- సమీప రైలు స్టేషన్ : దిల్లీ రైల్వే స్టేషన్
- సమీప బస్ స్టాండ్ : కాశ్మీర్ గేట్ ISBT
2. అమృత్‌సర్, పంజాబ్ :పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని 'శ్రీ హర్మందిర్ సాహిబ్' అని కూడా అంటారు. ఈ ఆలయం దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటిగా పేరుంది. సిక్కుల గురువు గురు నానక్ జయంతి నవంబర్‌లోనే వస్తుంది. అమృత్‌సర్ వేసవి కాలంలో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి, స్వర్ణ దేవాలయాన్ని నవంబర్‌లో చూడటం ఉత్తమ సీజన్. ఈ పవిత్ర స్థలాన్ని కేవలం సిక్కులు మాత్రమే కాకుండా అన్ని మతాల వారు సందర్శించవచ్చు. ఆలయంలోకి ప్రవేశించగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది.
చూడాల్సిన ప్రదేశాలు : గోల్డెన్ టెంపుల్, పంజాబ్ స్టేట్ వార్ మెమోరియల్ మ్యూజియం, రామ్ బాగ్ ప్యాలెస్, జలియన్ వాలా బాగ్, భగవాన్ వాల్మీకి తీరత్ స్థల్, వాఘా సరిహద్దు, పుల్ కంజ్రీ.
చేయాల్సిన పనులు : అమృత్‌సర్ చుట్టూ ఉండే రోడ్‌సైడ్ దాబాల్లో దొరికే బటర్‌నాన్ రుచులను తప్పక ఆస్వాదించండి. హాల్ బజార్, గురు బజార్, లాహోరీ గేట్ మార్కెట్‌లలో దొరికే సూట్లను షాపింగ్ చేయండి.
- సమీప విమానాశ్రయం : శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం, అమృత్‌సర్
- సమీప రైల్వే స్టేషన్ : అమృత్‌సర్ జంక్షన్
- సమీప బస్ స్టాండ్ : అమృత్‌సర్ బస్ డిపో
3. జమ్మూ కశ్మీర్ :భారత దేశ పర్యాటక ప్రదేశాల్లో జమ్మూ కశ్మీర్‌ది అగ్రస్థానం. ఇక్కడికి వెళ్లాలనుకోని పర్యాటకులు ఉండరంటే నమ్మశక్యం కాదు. అనేక గొప్ప రాజభవనాలు, కోటలు, దేవాలయాలకు కశ్మీర్ నిలయం. ఈ నగరం చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన పర్వతాలతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కశ్మీర్‌ను 'సిటీ ఆఫ్ టెంపుల్స్' అని కూడా అంటారు. జమ్మూలో రఘునాథ్ టెంపుల్, రణబీరేశ్వర్ టెంపుల్, పీర్ ఖో కేవ్ టెంపుల్, బావే వాలీ మాతా టెంపుల్, మాతా వైష్ణో దేవి ఆలయాలు ప్రసిద్ధమైన హిందూ పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి.
Zojila Tunnel: కశ్మీర్-లద్దాఖ్ పర్యటకానికి కొత్త వన్నెలు
చూడాల్సిన ప్రదేశాలు :రఘునాథ్ టెంపుల్, డోగ్రా ఆర్ట్ మ్యూజియం, సురిన్సర్ లేక్, బహు ఫోర్ట్, మన్సార్ లేక్, ముబారక్ మండి ప్యాలెస్, శివఖోరి, అమర్ మహల్ మ్యూజియం, పీర్ బాబా దర్గా.
చేయాల్సినవి : మాతా వైష్ణో దేవి ఆలయానికి తీర్థయాత్రకు వెళ్లండి. పట్నిటాప్ వద్ద జమ్మూ వంటకాలను ఆస్వాదించండి. మన్సార్ సరస్సు వద్ద బోట్ రైడ్‌కి వెళ్లి భీమ్‌ఘర్ కోటను సందర్శించండి.
- సమీప విమానాశ్రయం :జమ్మూ విమానాశ్రయం.
- సమీప రైల్వే స్టేషన్ : జమ్ము తావి రైల్వే స్టేషన్.
- సమీప బస్ స్టాండ్ : జమ్మూ బస్ స్టేషన్.
4. హరిద్వార్, ఉత్తరాఖండ్ :ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పట్టణం హిందువులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లోఒకటి. ఇక్కడికి ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. గంగా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరంలో చూడటానికి అనేక చారిత్రక ప్రదేశాలున్నాయి. దేశంలో నాలుగు నగరాల్లో పవిత్ర కుంభమేళాను నిర్వహిస్తే అందులో హరిద్వార్ కూడా ఒకటిగా ఉంది.
చూడాల్సిన ప్రదేశాలు : భారతమాత ఆలయం, చండీదేవి ఆలయం, భీమ్‌గోడ కుండ్, హర్ కీ పౌరి, దక్ష మహాదేవ్ ఆలయం, మానసా దేవి ఆలయం, మాయా దేవి ఆలయం.
చేయాల్సినవి : సాయంత్రం వేళ గంగా హారతిని చూడండి. బారా బజార్‌లో షాపింగ్ చేయండి. మానసా దేవి ఆలయానికి రోప్‌వే ద్వారా రైడ్ చేయండి.
- సమీప విమానాశ్రయం : జాలీ గ్రాంట్ విమానాశ్రయం, డెహ్రాడూన్ (37 కి.మీ).
- సమీప రైల్వే స్టేషన్ :హరిద్వార్ రైల్వే స్టేషన్.
- సమీప బస్ స్టాండ్ : హరిద్వార్ బస్ స్టాండ్.
5. వారణాసి, ఉత్తరప్రదేశ్ :హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో వారణాసి కూడా కూడా ఒకటి. వారణాసిలో అనేక హిందూ దేవాలయాలు, 100 కంటే ఎక్కువ ఘాట్‌లున్నాయి. ఇక్కడికి ప్రతి రోజూ వందలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కొందరు గంగానదిలో స్నానం చేస్తే, మరికొందరు హిందూ మతం గొప్పతనాన్ని తెలుసుకునేందుకు వస్తారు. నవంబర్‌లో వారణాసి నగరం చల్లగా ఉండి, చూడటానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు : అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, కాశీ విశ్వనాథ్ ఆలయం, సారనాథ్, మాన్ మందిర్ అబ్జర్వేటరీ, భరత్ కళా భవన్ మ్యూజియం.
చేయాల్సినవి : దశవమేధ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేసి, సాయంత్రం హారతిని తీసుకోండి. నదిలో బోటు షికారు చేయండి. రాంనగర్ కోట, మ్యూజియంసందర్శించండి. లోకల్ మార్కెట్లలో స్థానిక హస్తకళలు, బెనారసి చీరలను కొనుగోలు చేయండి.
- సమీప విమానాశ్రయం : వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం.
- సమీప రైల్వే స్టేషన్ : వారణాసి రైల్వే స్టేషన్.
- సమీప బస్ స్టాండ్ : వారణాసి బస్ స్టాండ్.
6. సాంచి, మధ్యప్రదేశ్ :భారతదేశంలోని పురాతన బౌద్ధ స్మారక కట్టడాలలో సాంచి స్థూపం ఒకటి. సాంచి స్థూపన్నే 'గ్రేట్ స్థూపం' లేదా 'స్థూపం నంబర్ 1' అని కూడా అంటారు. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. 3వ శతాబ్దంలో బౌద్ధమతంలోకి మారిన తర్వాత అశోకుడు ఈ స్థూపాన్ని నిర్మించాడు. మధ్యప్రదేశ్‌లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో సాంచి స్థూపం ఒకటి. ఇది రైసిన్ జిల్లాలో ఉంది.
చూడాల్సిన ప్రదేశాలు : సాంచి స్థూపం, ఉదయగిరి గుహలు, చెటియగిరి బౌద్ధ దేవాలయం, సాంచి పురావస్తు మ్యూజియం, గుప్తా ఆలయం.
చేయల్సినవి : ఉదయగిరి గుహలను సందర్శించండి. సాంచి మ్యూజియంలో చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోండి. బౌద్ధ స్థూపాలు, దేవాలయాలను సందర్శించండి.
- సమీప విమానాశ్రయం : రాజా భోజ్ విమానాశ్రయం, భోపాల్ (55 కి.మీ).
- సమీప రైల్వే స్టేషన్ : సాంచి రైల్వే స్టేషన్.
- సమీప బస్ స్టాండ్ : సాంచి బస్ స్టేషన్.
భూతల స్వర్గానికి సరికొత్త అందాలు.. కశ్మీర్ లోయకు పోటెత్తిన పర్యటకులు
Tulip Garden : శ్రీనగర్ తులిప్ గార్డెన్ అరుదైన ఘనత.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. 15లక్షల పుష్పాలతో..