Best Places to Visit in Ayodhya: అయోధ్య రామమందిరం ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరగనుంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా ఆ రాముల వారిని కనులారా దర్శించాలని భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు తరలివెళుతున్నారు. మరి మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. అయోధ్యలో కేవలం రామమందిరం మాత్రమే కాదు సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అంతదూరం వెళ్లినవారు.. ఇవి కూడా చూసి రండి మరి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం...
1. హనుమాన్ గర్హి:
- సమయాలు: ఉదయం 5:00 నుంచి రాత్రి 10:00 వరకు
- స్థానం : హనుమాన్ గర్హి, అయోధ్య
- ప్రవేశ రుసుము : ఉచితం
- ఎలా చేరుకోవాలి :అయోధ్య జంక్షన్ నుంచి దాదాపు 2 కి.మీ.
హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీరాముడి గొప్ప భక్తుడు హనుమంతుడు. ఆయన వెలసిన ఆలయమే హనుమాన్ గర్హి. ఈ ఆలయం ఓ కొండపై ఉంటుంది. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవాలంటే.. సుమారు 76 మెట్లు ఎక్కాలి. రామ నవమి, హనుమాన్ జయంతి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. అయోధ్యకు రక్షకుడిగా భావించే వాయుపుత్రుడిని తప్పనిసరిగా దర్శించుకోవాలని పండితులు అంటుంటారు.
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? ఈ మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు - పూర్తి వివరాలివే!
2. కనక్ భవన్
- సమయాలు : ఉదయం 5:00 నుంచి మధ్యాహ్నం 12:00, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:00 వరకు
- స్థానం : తులసి నగర్, అయోధ్య
- ప్రవేశ రుసుము : ఉచితం
- ఎలా చేరుకోవాలి : రామజన్మభూమి నుంచి సుమారు 2 కి.మీ.
రామజన్మభూమికి సమీపంలో ఉన్న తులసి నగర్‌లో ఉంది ఈ కనక్ భవన్. దీనినే గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1891లో నిర్మించారు. అయోధ్యలో ఉన్న ఈ భవన్ అద్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. దశరథుడు తన మూడో భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనం అని చెబుతారు. కైకైయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందంటారు. ఇందులో సీతారాముల విగ్రహాలుంటాయి.
3. నాగేశ్వరనాథ్ ఆలయం
- సమయాలు : ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 12:00, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:00 PM
- స్థానం: తేరీ బజార్, అయోధ్య
- ప్రవేశ రుసుము: ఉచితం
- ఎలా చేరుకోవాలి: హనుమాన్ గర్హి నుంచి నడక దూరం.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం.. అయోధ్యలోని తేరీ బజార్ పక్కన ఉంది. కొద్దిమంది శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మితే.. మరికొందరేమో శ్రీరాముని కుమారుడైన కుశలుడు స్థాపించినట్లు నమ్ముతారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి, ప్రదోష వ్రత్ సమయంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయు నది నుంచి నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు.
అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్‌లల్లా
4. గులాబ్ బారి
- సమయాలు : ఉదయం 9:00 నుంచి సాయంత్రం 6:00 వరకు
- స్థానం :వైదేహి నగర్, అయోధ్య
- ప్రవేశ రుసుము :INR 20 (సుమారుగా)
- ఎలా చేరుకోవాలి :రామజన్మభూమికి దగ్గరగా ఉంది. రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.
గులాబ్ బారీని గులాబీల తోట అని కూడా పిలుస్తారు. నవాబులు అయోధ్యలో నిర్మించిన అందమైన భవనాలలో ముఖ్యమైనవి గులాబ్ బారీ, మోతీ మహల్, బహు బేగం సమాధి . వీటిలో గులాబ్ బారిలో శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదు.
5. త్రేతా కే ఠాకూర్ ఆలయం
- సమయాలు :ఏకాదశి నాడు మాత్రమే ఓపెన్‌లో ఉంటుంది.
- స్థానం :నయా ఘాట్ దగ్గర, అయోధ్య
- ప్రవేశ రుసుము :ఉచితం
నయా ఘాట్ సమీపంలోని త్రేతా కే ఠాకూర్ ఆలయం.. దాని పురాతన, చారిత్రాత్మక శిల్పాలు సందర్శకులను చూపుతిప్పుకోనివ్వవు. రాముడు అశ్వమేధ యజ్ఞం చేసిన నేలపైనే ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత రాజు కులు నిర్మించారని నమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఏకాదశి రోజున ఈ గుడిని తెరిచి ఉంచుతారు.
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ - 22నే ఎందుకు చేస్తున్నారో తెలుసా?
6. ఛోటీ చావ్నీ
- సమయాలు :ఉదయం 9:00 నుంచి సాయంత్రం 6:00 వరకు
- స్థానం: వాల్మీకి భవన్, అయోధ్య
- ప్రవేశ రుసుము: ఉచితం
ఈ భవనాన్నే వాల్మీకి భవన్ అని కూడా పిలుస్తారు. బౌద్ధ, హిందూ, జైన విభాగాలుగా విభజించిన ఈ సైట్.. ప్రాచీన భారతీయ నాగరికతల అందాలను ప్రదర్శిస్తుంది. గుహలలోని కైలాస దేవాలయం కళాత్మక ప్రకాశాన్ని పెంచుతుంది.
7. సీతా కి రసోయి
- సమయాలు : ఉదయం 6:00 నుంచి రాత్రి 8:00 వరకు
- స్థానం :రామజన్మభూమి దగ్గర, అయోధ్య
- ప్రవేశ రుసుము :ఉచితం
- ఎలా చేరుకోవాలి :రామజన్మభూమి నుంచి నడక దూరం.
అయోధ్య వెళ్లేవారు సీతా కి రసోయి పేరు తప్పకుండా వింటారు. రామ జన్మభూమికి సమీపంలో ఈ సీతా కి రసోయి ఉంది. ఇది సీతాదేవి వంటగది. ఇప్పుడిది దేవాలయంగా రూపాంతరం చెందింది. నాటికాలం వంటపాత్రలు, వంట సామగ్రిని ఇక్కడ చూడొచ్చు.
8. తులసి స్మారక్ భవన్:
- సమయాలు : ఉదయం 8:00 నుంచి రాత్రి 8:00 వరకు
- స్థానం: అయోధ్య
- ప్రవేశ రుసుము: ఉచితం
సాధువు-కవి గోస్వామి తులసీదాస్ గౌరవార్థం నిర్మించిన తులసి స్మారక్ భవన్ ఒక సాంస్కృతిక కేంద్రంగా, పరిశోధనా కేంద్రంగా ఉంది. జాతీయ రహదారికి తూర్పు చివరన ఉన్న ఈ స్మారక్.. అయోధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన గొప్ప సాహిత్య రిపోజిటరీని కలిగి ఉంది. ప్రాంగణంలోని అయోధ్య రీసెర్చ్ సంస్థాన్.. అయోధ్య సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయడంపై దృష్టి పెడుతుంది.