Best Part Time Jobs For College Students : కాలేజ్ చదువులు నేడు బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, టెక్ట్స్ బుక్స్ సహా ఇతర ఖర్చులకు ఇంటి వాళ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే చాలా మంది పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, తమ సొంత సంపాదనతో చదువుకోవాలని ఆశిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం కచ్చితంగా చాలా మంచి విషయం. సాధారణంగా విదేశాల్లోని యువత ఒక వయస్సు దాటిన తరువాత, తల్లిదండ్రులు మీద ఆధారపడకుండా, స్వయంగా సంపాదన మొదలుపెడతారు. తమ సొంత సంపాదనతోనే చదువుకుంటారు. జీవనం కొనసాగిస్తారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా?.. అయితే మీకు ఉపయోగపడే 10 మంచి పార్ట్ టైమ్ జాబ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫ్రీలాన్సింగ్ : మీలో ఉన్న స్కిల్స్‌కు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేయవచ్చు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్.. ఇలా ఎన్నో రకాల ఫ్రీలాన్సింగ్ జాబ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా Fiverr, Upwork లాంటి వైబ్‌సైట్స్‌లో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ లక్షల్లో ఉంటాయి. కనుక మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ.. మంచిగా మనీ సంపాదించవచ్చు.
- ఆన్లైన్ సెల్లింగ్ : నేడు ఆన్లైన్లో ఏ వస్తువునైనా అమ్మడానికి అవకాశం కలుగుతోంది. కనుక మీరు స్వయంగా చేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్మవచ్చు. ఉదాహరణకు నేడు చాలా మంది నేడు ఇంటివద్దనే ఉంటూ ఆన్లైన్లో చీరలు, పూల మొక్కలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతున్నారు. కనుక మీరు కూడా ఆన్లైన్లో మీకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను సెల్ చేయవచ్చు.
- అద్దెకు ఇవ్వండి : మీ దగ్గర కారు, బైక్, కెమెరా లాంటివి ఉంటే.. వాటిని అద్దెకు ఇవ్వవచ్చు. దీని వల్ల మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం Turo, Spinlister, Fat lama లాంటి వెబ్‌సైట్స్.. ఇలాంటి రెంటింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి.
- ఫోకస్ గ్రూప్స్‌లో చేరండి :మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు.. ఫోకస్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ గ్రూప్‌ల ద్వారా ఆయా కంపెనీలకు చెందిన ప్రొడక్టులను, వాటి మార్కెటింగ్‌ను, సర్వీస్‌ను, ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకుంటాయి. వీటి ఆధారంగా.. కంపెనీలు ఆయా ప్రొడక్టులను, సర్వీసులను ఎలా మెరుగుపరుచుకోవాలో సూచిస్తుంటాయి. మీరు కనుక ఇలాంటి ఫోకస్ గ్రూప్‌లో పనిచేస్తే.. కచ్చితంగా మంచి ఆదాయం లభిస్తుంది.
- ట్యూషన్లు చెప్పండి : మీకు గనుక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే.. ట్యూషన్ చెప్పి కూడా బాగా డబ్బులు సంపాదించవచ్చు. వన్-టూ-వన్ ట్యూషన్ మాత్రమే కాదు.. ఆన్లైన్ క్లాసుల ద్వారానూ డబ్బులు బాగా సంపాదించవచ్చు.
- సైడ్ బిజినెస్ చేయవచ్చు : చాలా మంది యువత ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సైడ్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఫొటోగ్రఫీ, సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ లాంటివి చేస్తూ ఉంటారు. మరికొందరు ఈవెనింగ్ టిఫిన్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు. మీరు కూడా ఇలానే ట్రై చేయవచ్చు.
- పార్ట్-టైమ్ జాబ్స్ : సాధారణంగా విదేశీ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు తమ ఖాళీ సమయంలో రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, రిటైల్ స్టోర్స్‌లో పనిచేసి, పాకెట్ మనీ సంపాదిస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ఇలా పనిచేయడానికి విద్యార్థులు సిగ్గు పడుతూ ఉంటారు. పనిచేయకుండా ఇంట్లోవాళ్లు పంపించే డబ్బులు మీద ఆధారపడడం సిగ్గు చేటు. అంతేగానీ కష్టపడి పనిచేసి, ఎవరి మీదా ఆధారపడకుండా బతకడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. కనుక మీకు వీలైతే ఇలాంటి పనులు చేయడానికి ఎలాంటి మొహమాటం పడకండి.
- డిఫరెంట్ పనులు చేయవచ్చు : ధనవంతుల ఇళ్లలో పెద్దవాళ్లను చూసుకోవడానికి మనుషులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు చేయడానికి వాళ్లు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఇస్తారు. కనుక వయస్సు మీరిన వారికి సాయం చేస్తూనే.. డబ్బులు సంపాదించే ఇలాంటి పనులు చేయవచ్చు. ఇందులో ఎలాంటి తప్పు లేదు.
- సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారండి : నేడు సోషల్ మీడియా హవా నడుస్తోంది. దీనితో ఇన్‌ప్లూయెన్సర్లకు కాసుల వర్షం కురుస్తోంది. మీకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటే.. కచ్చితంగా దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయండి.
- బోలెడు అవకాశాలు : పైన చెప్పినవే కాదు.. నేటి కాలంలో ఎన్నో రకాల అవకాశాలు మన కళ్లముందరే కదలాడుతూ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన జాబ్ చేస్తూ.. ఉన్నత విద్యను అభ్యసించి.. కోరుకున్న ఉద్యోగాన్ని లేదా లక్ష్యాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్!