Best Career Options After 12th Class :ఇంటర్ పూర్తి చేసిన తరువాత చాలా మందికి.. ఎలాంటి కెరీర్ ఆప్షన్ ఎంచుకుంటే మంచిది? అనే ఒక డైలమా ఏర్పడుతుంది. దేశంలో ఇప్పటికీ బీఏ, బీఎస్సీ, బీకాం లాంటి కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ సంప్రదాయ విద్యలతోపాటు, మరెన్నో అధునాతన కోర్సులు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. వీటిలోంచి మీ అభిరుచికి అనుగుణంగా ఒక మంచి కెరీర్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
Career Guidance After 12th : సరైన సమయంలో, సరైన గైడెన్స్ లేక చాలా మంది విద్యార్థులు తమకు ఏమాత్రం అభిరుచి లేని కెరీర్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. తరువాత వాటిని చదవలేక మధ్యలోనే వదిలిపెట్టడమో, లేదా మొక్కుబడిగా పూర్తి చేయడమో చేస్తుంటారు. దీని వల్ల వారు భవిష్యత్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇంటర్ పూర్తయ్యే నాటికే, మీ ముందు ఉన్న బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం ఉత్తమం.
Top 10 Career Options After Intermediate : ప్రస్తుతం భారతదేశంలో మంచి డిమాండ్ ఉన్న టాప్-10 కెరీర్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఇంజినీరింగ్ కోర్సులు : బ్యాచులర్ ఆఫ్ ఇంజినీరింగ్ (BE), బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech)లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఫస్ట్ క్లాస్ మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి మంచి జాబ్ ఆపర్చూనిటీస్ ఉంటాయి. ఒక సర్వే ప్రకారం, ఇంజినీరింగ్ ఉద్యోగులు సంవత్సరానికి యావరేజ్‌గా రూ.6.98 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇంజినీరింగ్‌లో మంచి ప్రతిభ ఉండి, పరిశ్రమకు కావాల్సిన స్కిల్స్ ఉంటే కనుక.. కోట్లలో కూడా సంపాదించే అవకాశం ఉంటుంది.
- మెడికల్ కోర్సులు : ఇంటర్ తరువాత MBBS లేదా BDS కోర్సులు చేయవచ్చు. ఈ మెడికల్ కోర్సుల్లో క్వాలిఫై అయిన వైద్యులు సంవత్సరానికి సరాసరిగా రూ.13.48 లక్షలు సంపాదిస్తున్నారని సమాచారం. సూపర్ పాప్యులర్ డాక్టర్స్ అయితే నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంటారని సమాచారం.
- టీచింగ్ కోర్సులు : భారతదేశంలో గురువులను దైవంగా భావిస్తారు. అందుకే B.Ed, B.EI.Ed, BTC, D.Ed లాంటి కోర్సులకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారు సంవత్సరానికి సగటున రూ.1.17 లక్షల నుంచి రూ.6.63 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.
- జర్నలిజం కోర్సులు : సోషల్ మీడియా విజృంభించిన తరువాత జర్నలిజం విలువలు బాగా పడిపోయాయి. కానీ ఇప్పటికీ ప్రొఫెషనల్ జర్నలిస్టులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. BMJC, BMM, BMC, MJMC సహా, BA (మల్టీమీడియా) చేసిన వారికి మంచి కేరీర్ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రొఫెషనల్ జర్నలిస్టులు సంవత్సరానికి సగటున రూ.1.24 లక్షల నుంచి రూ.9.78 లక్షలు వరకు సంపాదిస్తున్నారు.
- లాయర్ కోర్సులు : దేశంలో ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు సివిల్ తగాయిదాలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. అందుకే నేడు లాయర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు LLB చేసి న్యాయవాద వృత్తిలోకి వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇండియాలోని లాయర్లు సంవత్సరానికి యావరేజ్‌గా రూ.1.48 లక్షల నుంచి రూ.20 లక్షలు వరకు సంపాదిస్తున్నారు. కొందరు పేరుమోసిన లాయర్లు గంటకు లక్షల్లో, ఒక్కో కేసుకు కోట్ల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు చదువుతుంటాం. కనుక లాయర్ కోర్సులు చదువుకున్నవారికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు.
- హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు : ఒకప్పుడు మగవాళ్లు వంట చేస్తుంటే.. సమాజం వారిని చాలా చిన్నచూపు చూసేది. కానీ నేడు ఆ పరిస్థితులు మారిపోయాయి. చెఫ్‌లకు నేడు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ వారికి లక్షల్లో జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు Bachelor of Hotel Management లాంటి కోర్సులు చేయవచ్చు. ప్రస్తుతం హెడ్ చెఫ్‌లు సంవత్సరానికి సగటున రూ.30 లక్షలు వరకు సంపాదిస్తున్నారని సమాచారం.
- ఛార్టర్డ్ అకౌంటెన్సీ : ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలనుకునేవారికి మంచి డెడికేషన్ ఉండాలి. లేకుంటే కోర్స్ పూర్తి చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలోని CAలు సంవత్సరానికి సుమారుగా రూ.4.17 లక్షలు నుంచి రూ.20 లక్షలు వరకు సంపాదిస్తున్నారని సమాచారం.
- సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ :ఇది కూడా చాలా మంచి కెరీర్ ఆప్షన్. CMA కోర్సు చేసి ఈ ప్రొఫెషన్లో చేరవచ్చు. ఒక సర్వే ప్రకారం, నేడు దేశంలోని మేనేజ్మెంట్ అకౌంటెంట్లు సుమారుగా రూ.7.97 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు.
- యానిమేటర్ కోర్సులు : మీలో మంచి క్రియేటివిటీ ఉంటే.. యానిమేటర్ కోర్సులు చేయవచ్చు. నేటి కాలంలో.. సినిమాలు, ఎడ్వర్టైజ్మెంట్స్, కార్టూన్స్, కంప్యూటర్ గేమ్స్, టెలివిజన్, వెబ్‌సైట్స్ సహా చాలా విభాగాల్లో యానిమేషన్ తప్పనిసరి అయ్యింది. అందుకే యానిమేటర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం యానిమేటర్లు సంవత్సరానికి యావరేజ్‌గా రూ.1.06 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అంతేకాదు సూపర్ స్కిల్స్ ఉన్నవారు కోట్లలోనూ సంపాదిస్తున్నారని సమాచారం.
- ఎయిర్ హోస్టెస్/ స్టివర్డ్స్ కోర్సులు : నేడు విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. అందుకే ఎయిర్ హోస్టెస్ (మహిళలు), స్టివర్డ్స్ (పురుషులు) పోస్టులకు మంచి డిమాండ్ ఏర్పడింది. వాస్తవానికి ఈ జాబ్స్ కోసం ప్రత్యేకమైన కోర్సులు అంటూ ఏమీ ఉండవు. కానీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బీఏ కోర్సులు చేసినవారు కూడా ఈ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇంగ్లీష్ వచ్చినవారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్/ స్టివర్డ్స్ సంవత్సరానికి సగటున రూ.2.41 నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.