బంధువుల ఇంట్లో నుంచి తప్పిపోయిన 15 ఏళ్ల బాలిక ఆచూకీని ఎట్టకేలకు కనిపెట్టారు కర్ణాటక పోలీసులు. దాదాపు 240 కి.మీ. దూరంలో ఉన్న.. తన తాత, అమ్మమ్మను చూసేందుకు ఆమె కాలినడకన బయలుదేరిందని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని విరాజిపేట్కు చెందిన అయ్యప్ప బనశంకరి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట.. తల్లిదండ్రులు లేని తమ బంధువుల మనవరాలు రోహితను (పేరు మార్చాం) చదువుల నిమిత్తం బెంగళూరులోని తమ ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడే యడియూరులోని ప్రభుత్వ పాఠశాలలో బాలికను చేర్పించారు. కానీ.. ఆగస్టు 21న ఆమె కనిపించకుండా పోయింది.
విషయం తెలిసిన అయ్యప్ప ఎంత వెతికినా.. ఆచూకీ కనుగొనలేకపోయాడు. చివరికి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ పుట్టస్వామి ఆధ్వర్యంలో.. ఎస్ఐ మంజునాథ్ బృందం బాలిక కోసం తీవ్రంగా గాలించింది. బసవనగుడి, చామరాజపేట, మైసూర్ రోడ్డు ప్రాంతాల్లోని 250కిపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. చివరకు రోడ్డుపై ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపెట్టారు. కెంగేరీలోని కూమ్మఘట్టె ప్రాంతం వరకు కాలినడకన వెళ్లిందని గుర్తించారు. రోహిత ఆచూకీ చెప్పాలని.. కూమ్మఘట్టె సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కరపత్రాలు పంచారు పోలీసులు.
వారు గుర్తొస్తున్నారు..
చివరకు ఎలాగోలా ఆ బాలిక కేసును ఛేదించగలిగారు. బనశంకరి నుంచి నడక మొదలుపెట్టిన ఆమె.. కూమ్మఘట్టె వరకు చేరుకుంది. అంటే దాదాపు 30 కి.మీ. నడిచింది. అక్కడ రోడ్డుపక్కన నిల్చొని భయంభయంగా ఉన్న రోహితను ఓ మహిళ పలకరించగా .. తనకు తల్లిదండ్రులు లేరని, కొన్నిరోజులు ఆశ్రయం ఇవ్వాలని ఆమెను కోరింది. అలా 10 రోజులు రోహిత.. ఆ మహిళ ఇంట్లో ఉంది.
''నాకు తల్లిదండ్రులు లేరు. నేను మా అమ్మమ్మ-తాతయ్య ఇంటికి వెళ్లాలి. నా బంధువులు వచ్చి నన్ను తీసుకెళ్తారు. అప్పటివరకు నాకు ఆశ్రయం ఇవ్వండి.''
- రోహిత అభ్యర్థన