కర్ణాటకలో నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. మైసూర్ దసరా ఉత్సవాలు (Mysore dasara 2021) కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పండుగ శోభ నెలకొంది. అయితే.. బెంగళూరు త్యాగరాజ్ నగర్లోని ఓ ఇల్లు మిమ్మల్ని చూపుతిప్పుకోనివ్వదు. అంతలా ఏముందనుకుంటున్నారా? అదే ఆ ఇంటి ప్రత్యేకత మరి. మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లి.. పురాతన గాథలను కళ్లకు కడుతుంది.
భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ.. ఏకంగా 10 వేల దసరా బొమ్మలతో(Mysore dasara 2021) తన ఇంటిని అందంగా అలంకరించారు. మహాభారతాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని.. అందులోని కీలక సన్నివేశాలు, సంఘటనలను తలపించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ద్రౌపది స్వయంవరం, పాచికల ఆట, ద్రౌపది వస్త్రాపహరణం, అంపశయ్యపై నిద్రిస్తున్న భీష్ముడు వంటి సన్నివేశాలను మనం అక్కడ చూడొచ్చు.
ఇందుకోసం వివిధ దేశాల నుంచి కూడా బొమ్మలను తెప్పించారు భాగ్యలక్ష్మి. వీటిలో 100 సంవత్సరాలకు ముందువి కూడా ఉన్నాయి. మొత్తం 50 వేలకుపైగా బొమ్మలుండగా.. ఈసారి 10 వేల బొమ్మలను వినియోగించినట్లు చెప్పుకొచ్చారు. 60 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు భాగ్యలక్ష్మి వివరించారు.
''కరోనా మహమ్మారి కారణంగా.. గతేడాది నవరాత్రికి మేం బొమ్మలను సేకరించి పెట్టలేకపోయాం. ఇప్పుడు సమయం దొరికినందున 250 రకాల బొమ్మలను జుట్టు, దుస్తులు, ఆభరణాలతో అలంకరించాం. మహాభారతాన్ని వివరించేలా అందులోని పాచికల ఆట, ద్రౌపది మానభంగం, భీష్ముడు నిద్రించడం, ద్రౌపది స్వయంవరం వంటి సంఘటనలను ఎంచుకున్నాం.''
- భాగ్యలక్ష్మి