కర్ణాటక బెంగళూరులో రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఇటీవలే సంజయ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం అంతటా ఖరీదైన సైకిళ్లను దొంగలిస్తున్నాడనే నేరంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 10లక్షలు విలువ చేసే 45సైకిళ్లను సీజ్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం..
నిందితుడు.. అతడి స్నేహితుడితో కలిసి కొంతకాలంగా ఖరీదైన సైకిళ్లను దొంగలిస్తున్నాడు. ఇద్దరు కలిసి సాయంత్రం వేళ సంజయ్ నగర్, హెబ్బల్, మరాథాహళ్లి, నందిని లేఅవుట్, యెలహంక న్యూ టౌన్, అమృతహళ్లి, హైగ్రౌండ్స్ సైకిళ్ల వేటలో పడేవారు. ఏదైనా సైకిల్ కనిపిస్తే.. రాత్రికి దాన్ని దొంగలించేవారు. మరో వ్యక్తి సహాయంతో దానిని అమ్మేసేవారు.
నగరంలో నేరాలకు అడ్డుకట్టవేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సెప్టెంబర్ 19 ఓ ఆపరేషన్ను నిర్వహించారు. 40- 50 మందిపై నిఘా పెట్టారు. వారిలో ఒకరి వద్ద కట్టర్ ఉందని, సైకిళ్లను దొంగలించేందుకు దానిని వాడుతున్నాడని పోలీసులకు తెలిసింది. చివరికి సెప్టెంబర్ 22న సైకిల్ దొంగ, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. సైకిళ్లు అమ్మేందుకు సహాయం చేసిన వ్యక్తి పారిపోయాడు.