Girl influenced by shamanism: బెంగళూరులో.. ఈ ఏడాది అక్టోబర్ 31న.. అనుష్క అనే మైనర్ ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఇల్లు వదిలి వెళ్లేలా ఎవరో ఆమెను ప్రభావితం చేశారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. షమానిజంపై ఉన్న ఆసక్తితోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు.
షమానిజం అనేది.. ఓ పురాతన సంప్రదాయం. కళ్లకు కనిపించని వాటిపై నమ్మకం పెంచుకోవడాన్ని షమానిజం అంటారు. షమానిజంకు ప్రభావితమైనవారు.. దేవుళ్ల ప్రపంచాన్ని చూస్తున్నట్టు భావిస్తుంటారు. భూతాలు, పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తుంటారు.
అనుష్కకూ దీనిపై ఆసక్తి ఉండేదని ఆమె తల్లి వెల్లడించారు. ఎక్కడున్నా తిరిగి రావాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు.
"షమానిజం తరహా ధ్యానం నేర్చుకోవాలని ఉందని నాతో చెప్పింది. అదేంటో మాకు సరిగ్గా తెలియదు. తను చెప్తేనే మాకు షమానిజం అంటే తెలిసింది. ఇంట్లోనే ఉండి నేర్చుకో అని మేము తనకు చాలాసార్లు చెప్పాము. ఇంట్లో ఉండి నేర్చుకోలేనని తను అనుకున్నట్టు ఉంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే ఒకరోజు ముందు కూడా మేము తనకు చాలా నచ్చచెప్పాము. 'మీరెవరూ నన్ను అర్థం చేసుకోరు,' అని అరిచింది. ఆ సమయంలో నేను తనను కొంచెం తిట్టాను. అలా మాట్లాడకూడదు అని మందలించాను. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా. ఆ రోజు కూడా నేను చాలా సార్లు క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు అందరి ముందు నేను నా కూతురికి క్షమాపణలు చెబుతున్నాను. ఆ రోజు శని, ఆదివారాల్లోనూ నేను క్షమాపణలు కోరాను. కానీ వాకింగ్ అని వెళ్లి ఇంటికి తిరిగి రాదని అనుకోలేదు. అనుష్క.. అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించు. నాన్న, సోదరుడి గురించి ఆలోచించు. ఈ అమ్మ పరిస్థితిని అర్థం చేసుకుని తిరిగొచ్చేయ్. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఏడుస్తూ, ఏడుస్తూ.. నా కళ్లు పాడైపోతాయేమోనని భయంగా ఉంది. ఏదీ సరిగ్గా చదవలేకపోతున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నా బాధను ఓ తల్లి మాత్రమే అర్థం చేసుకోగలదు. ఇంటికి రావడానికి.. ఒక గంట ఆలస్యమైతేనే భయపడిపోతాను. అలాంటిది ఇన్ని రోజులు నువ్వు నన్ను వదిలేసి ఎలా ఉండగలవు? నేను ఎలా బతకగలను?"
-- అర్చన, అనుష్క తల్లి.