కర్ణాటకలో అమానుష ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతిపై కొంత మంది కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ దృశ్యాలను తమ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం బాధితురాలిని కేరళలో నిర్బంధించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కేరళ కాలికట్‌లోని నిర్బంధించిన బాధితురాలిని బెంగళూరులోని రామ్మూర్తి నగర్ పోలీసులు విడిపించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
నిందితులైన రిదాయ్ బాబు(ఏ1), రాకిబుల్ ఇస్లాం సాగర్(ఏ2), మహమ్మద్ బాబు షేక్(ఏ3), అఖిల్(ఏ4), కాజల్(ఏ5), నజ్రత్(ఏ6)ను రామ్మూర్తి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా వ్యభిచార ముఠాకు చెందిన వారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బాధితురాలి జననాంగంలో సీసాను జొప్పించి, హింసించినట్లు వీడియోలో కనిపించిందని వెల్లడించాయి. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కేరళకు చేరుకున్న బెంగళూరుకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం.. నిర్బంధించిన బాధిత మహిళను విడిపించింది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
"సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిందితులకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటాం."
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.