భార్యాభర్తల్ని బెంగళూరు పోలీసులు వేధించారన్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డు మీద తిరగకూడదని పోలీసులు తమను బెదిరించారని ఓ వ్యక్తి ఆరోపించారు. రూ.3,000 జరిమానా కట్టాలని డిమాండ్ చేశారని చెప్పారు. అసలేం జరిగిందంటే..
ఇదీ జరిగింది..
బెంగళూరుకు చెందిన భార్యాభర్తలు.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. పెట్రోలింగ్ కోసం వ్యానులో వచ్చిన ఇద్దరు పోలీసులు వారిని ఆపారు. చట్టాన్ని ఉల్లంఘించి రాత్రి సమయంలో బయట తిరుగుతున్నందుకు రూ.3,000 జరిమానా చెల్లించాలని దంపతులను డిమాండ్ చేశారు. బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వారిని పోలీసులు ఎలా వేధింపులకు గురిచేశారో బాధితుడు కార్తీక్ పత్రి.. ట్విట్టర్లో రాసుకొచ్చారు. దానిని బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు.. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నామని తెలిపారు.
'నేను నా భార్యతో కలిసి గురువారం రాత్రి 12.30 సమయంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన ఘటన గురించి చెప్పాలని అనుకుంటున్నా. నా స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇద్దరం వస్తున్నాం. పెట్రోలింగ్ వ్యాన్‌లో వచ్చి ఇద్దరు కానిస్టేబుళ్లు మమ్మల్ని ఆపారు. ఐడీ కార్డులు చూపించమని అడిగారు. వెంటనే నా ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు ఫొటోలను చూపించాం. అంతలో నా వద్ద ఉన్న మొబైల్‌ను పోలీసులు తీసుకున్నారు. అయినా వారి పట్ల మేము కోపగించుకోలేదు. వారు అడిగిన ప్రశ్నలకు మేము మర్యాదపూర్వకంగానే సమాధానం ఇచ్చాం. అంతలోనే పోలీసులు చలానా బుక్ తీసి మా పేర్లు, ఆధార్ నెంబర్లు రాయడం ప్రారంభించారు. ఎందుకు చలాన్ రాస్తున్నారని అడిగాను. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి రూల్స్ లేదని తెలిసినా.. అర్ధరాత్రి కావడం వల్ల మౌనంగా ఉండిపోయా. పోలీసులకు క్షమాపణలు చెప్పాం. కానీ వారు మమ్మల్ని విడిచిపెట్టేందుకు నిరాకరించారు. జరిమానాగా రూ.3,000 కట్టమని డిమాండ్ చేశారు. చివరకు రూ.1,000 కట్టేందుకు అంగీకరించా.'