- దీదీ హవా కొనసాగుతుందా?
- మోదీ మంత్రం అద్భుతం చేస్తుందా?
- కోల్‌కతా పీఠం ఎవరికి దక్కుతుంది?
బంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు చర్చనీయాంశమైన ప్రశ్నలివి. అందుకు తగినట్టే ఆ రాష్ట్ర రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పదునైన వ్యూహాలు రచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు అందుకున్న భాజపా.. ఈసారి బంగాల్‌లో పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది.
ఇలాంటి సమయంలో బంగాలీవాదం తెరపైకి వచ్చింది. బంగాలీల ఆత్మగౌరవం, స్థానికులు వర్సెస్ ఔట్‌సైడర్స్ పేరిట పెద్ద యుద్ధానికి తెరలేచింది. భాజపా హిందుత్వ వాదానికి చెక్ పెట్టేందుకు బంగాలీ ఆత్మ గౌరవ నినాదాన్ని అధికార టీఎంసీ ఎంచుకుంది. తమది లోకల్ అని, భాజపా ఔట్‌సైడర్స్ పార్టీ అని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బంగాల్‌లో భాజపా నిర్వహించిన ర్యాలీలో సంఘసంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమ అపవిత్రం కావడం, అసోంలో ఎన్‌ఆర్‌సీ విడుదలను టీఎంసీ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్‌ఆర్‌సీలో అసోంలోని 19 లక్షల మంది ప్రజల పేర్లు గల్లంతుకాగా, వారిలో అత్యధికులు బంగాలీయులు కావటం భాజపాను బంగాల్ వ్యతిరేక పార్టీగా ముద్రవేసేందుకు టీఎంసీకి ఉపకరించింది. టీఎంసీ ప్రచారానికి తోడు బంగ్లా పొక్కో, జతియో బంగ్లా సమ్మేళన్, బంగ్లా సంస్కృతి మంచ్ వంటి సంస్థలు భాజపా హిందీని, ఉత్తరాది సంస్కృతిని బంగాలీయులపై బలవంతంగా రుద్దాలని ఆరోపిస్తుండటం కమలదళాన్ని కలవరపరుస్తోంది.
ప్రతివ్యూహాలు..
టీఎంసీ వ్యూహాలను అడ్డుకునే క్రమంలో భాజపా ప్రతివ్యూహాలతో సిద్ధమైంది. ఆత్మగౌరవం అంటూనే టీఎంసీ అందుకు విరుద్ధమైన పనులు చేస్తోందన్న కమలనాథులు.. బంగాలీ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేది తామేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో అందరి అభివృద్దే తమ ధ్యేయమంటున్నారు. పలు రాష్ట్రాలలో భాజపా అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క భాషనో, సంస్కృతినో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఓట్ల కోసం టీఎంసీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తున్నారు.
రూటు మార్చిన రాజకీయం
'లోకల్' మంత్రం బంగాల్‌కు చాలా కొత్త. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 'బంగాలీ ఆత్మగౌరవం' తెరపైకి రావడానికి ప్రధాన కారణం భాజపా. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్‌లో ప్రభంజనం సృష్టించింది భాజపా. ఆ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో ఏకంగా 18 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీని 22 సీట్లకే పరిమితం చేసి, ఊహించని దెబ్బ కొట్టింది. మిగిలిన 2 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్‌లో భాజపా గెలిచింది 2 సీట్లే. అలాంటి పార్టీ 2019లో అనూహ్యంగా పుంజుకున్నాక... రాష్ట్ర రాజకీయం రూపు మారింది. హిందుత్వ శక్తుల దూకుడు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే బంగాల్‌లో పెద్దగా ప్రాచుర్యం లేని శ్రీరామ నవమి వంటి పండుగలకు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించే సంస్కృతి మొదలైంది. ఆ ర్యాలీల సందర్భంగా వేర్వేరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం.. రాజకీయ వేడిని మరింత పెంచింది.
దీదీ దూకుడు..
ఈ క్రమంలో బంగాలీ ఆత్మగౌరవాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. "భాజపా బయటి వ్యక్తుల పార్టీ. బంగాల్ అధికార పగ్గాల్ని గుజరాతీలకు(మోదీ, షాను ఉద్దేశించి), బయటి వ్యక్తులకు అప్పగిస్తారా?" అని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు.
"బంగాల్‌లో కాషాయ దళం పుంజుకోవడం వల్ల బంగాలీల్లో భయం మొదలైంది. ఎన్‌ఆర్‌సీ అమలు, హిందీని బలవంతంగా రుద్దడం వంటివి ఇందుకు కారణం. మేము భాజపాలా కాదు. మేము లౌకికవాదం, సమ్మిళిత అభివృద్ధినే నమ్ముతాం" అని టీఎంసీ అధికార ప్రతినిధి సౌగతా రాయ్ చెప్పారు.
ఓటమి భయంతోనే