ప్రస్తుత కథనం మనం చూసిన జంగిల్‌బుక్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. ఈ కథలో అనాథ అయిన మోగ్లీ అనే బాలుడితో అడవిలో ఉండే అనేక రకాల జంతువులు, పక్షులు ఏ విధంగా స్నేహాన్ని పెంచుకున్నాయో చూశాము. ఇప్పుడు తెలుసుకోబోయే కథ కూడా అచ్చం అలాంటి కోవలోనిదే. ఓ చిన్నారితో ప్రేమలో పడింది పక్షి. ఆ చిన్నారితోనే తింటూ.. క్లాస్‌రూమ్‌లో పాఠాలు కూడా వింటోంది ఆ పక్షి. ఆ కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగాల్లోని పశ్చిమ్ బర్దమాన్ జిల్లాకి చెందిన అంకిత బగ్దీ కాంక్సా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అనుకోకుండా ఓ రోజు గుర్తుతెలియని పక్షి వచ్చి అంకిత భుజంపై వాలింది. 'అలా మొదలైంది..' వీరిద్దరి స్నేహం. అప్పటి నుంచి అంకిత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది ఈ పక్షి. ఆమె తరగతి గదిలో పాఠాలు వినేందుకు కూర్చునప్పుడు కూడా ఆ పక్షి బాలిక భుజం, తలపై లేదా క్లాస్‌రూమ్‌లోని బెంచీపై కూర్చొని నిశ్శబ్దంగా పాఠాలు వింటుంది. అంకిత ఈ పిట్టకు ముద్దుగా 'మిఠు' అనే పేరు పెట్టింది.
మాములుగా మునుషుల శబ్దం వింటేనే పక్షులు ఆమడ దూరం ఎగిరిపోతాయి. అలాంటిది మిఠు మాత్రం బడి గంట మోగినా, విద్యార్థులు తన దగ్గరకు వచ్చినా డా ఎగిరిపోకుండా అక్కడే నిలబడి ఉంటుంది. అంతేగాక ఉదయం విద్యార్థులు బడిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా వాళ్ల కాళ్ల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. భోజనం చేసే సమయాల్లో కూడా పిల్లల చుట్టే తిరుగుతుందీ 'మిఠు'. భోజన విరామ సమయంలో అంకిత తన టిఫిన్ బాక్స్‌లో తెచ్చిన ఆహారాన్ని మిఠుతో పంచుకుంటుంది. ఇలా మిగతా విద్యార్థులు కూడా చాక్లెట్లు, బిస్కెట్లు ఏది పెట్టినా చటుక్కున చేతుల్లో నుంచి లాక్కుంటుంది మిఠు. ఇలా అందరి విద్యార్థులతో కూడా స్నేహంగా ఆడుకుంటూ చివరికి అంకిత వద్దకే చేరుకుంటుంది. వీరి స్నేహాన్ని చూసిన పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మిఠు అంటే నాకు చాలా ఇష్టం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నేనంటే కూడా మిఠుకి అమితమైన ప్రేమ. స్కూల్ సమయం ముగిశాక మిఠు అక్కడే ఉన్న ఓ చెట్టులో ఏర్పరుచుకున్న గూడుకి వెళ్లిపోతుంది. మరుసటి రోజు పాఠశాల ప్రారంభ సమయానికి అది నా దగ్గరకు వస్తుంది. ఎప్పుడైనా మిఠు ఆలస్యంగా వచ్చినప్పుడు నేను కాస్త బాధపడతాను.