బంగాల్‌లో భాజపా అధికారంలోకి రాకూడదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఆకాంక్షించారు. స్థానిక నాయకత్వాన్ని కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నవారిని ఎన్నుకోవడం ద్వారా జాతీయ తిరోగమనంలో బంగాల్ భాగస్వామి కాకూడదని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రశంసించిన సేన్.. రాష్ట్రంలోని అవినీతిపై మాత్రం దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బంగాల్ ఎన్నికల నేపథ్యంలో 'పీటీఐ' వార్తాసంస్థతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. పలు అంశాలపై సేన్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
దేశానికి భాజపా పాలన మేలు చేయడం లేదు. ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. వాళ్ల దృష్టంతా బంగాల్‌లో అధికారం చేజిక్కించుకోవడంపైనే ఉంది. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించడం మంచిది కాదు.
మతతత్వ విభజన దురదృష్టకరం
మునుపెన్నడూలేనంతగా బంగాల్ సమాజంలో మతతత్వ విభజన రేఖలు కనిపిస్తున్నాయి. అలాంటి విభజనకు ప్రయత్నిస్తున్న శక్తులకు ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఈ ఎన్నికల్లో స్థానికులు-స్థానికేతరులన్న వాదన చాలా వినిపిస్తోంది. బంగాల్ ఎన్నడూ ఇలాంటి వివక్ష చూపలేదు. బెంగాలీయేతర హిందువుల మద్దతుతో బెంగాలీ ముస్లింలను పక్కనబెట్టాలనుకోవటం సరికాదు. గాంధీజీ చెప్పినట్లు బంగాల్ ఎప్పుడూ ఐక్యతను కోరుకుంటుందే తప్ప విభజనను కాదు.
అవినీతికి కళ్లెం పడాలి
దీదీ అనేక మంచి సంక్షేమ పథకాలు చేపట్టారు. ముఖ్యంగా బాలికల కోసం. గుజరాతీ కుటుంబాలతో పోలిస్తే పేదవారైనా బెంగాలీ కుటుంబాల్లోని పిల్లలు ఆరోగ్యపరంగా బాగున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ఆహార భద్రతకు మమత కృషిచేస్తున్నారు. అయితే పాలనలో ఇంకా మెరుగుపడాల్సినవి, సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అవినీతిని కట్టడి చేయాలి.
ఇదీ చూడండి:బంగాల్‌లో ప్రచార పంథా మార్చిన భాజపా!