బంగాల్లో గురువారం ముగిసిన రెండో దశ ఎన్నికల్లో 86.11 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు జిల్లాల్లోని 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 1న ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్‌లో 75.94 లక్షల మంది పాల్గొన్నారని, 80.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఈసీ. తాజాగా తుది గణాంకాలు విడుదల చేసింది.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో 88.01 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆరిజ్ అఫ్తాబ్ తెలిపారు. జిల్లాల వారిగా చూస్తే.. పుర్బా మేదినీపుర్‌లో అత్యధికంగా 87.42 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో బంకుర (86.98 శాతం), దక్షిణ 24 పరగణాలు (86.74 శాతం), పశ్చిమ్ మేదినీపుర్ (83.84 శాతం) ఉన్నాయి. బంకుర జిల్లాలోని కోతుల్పుర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 90 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా పశ్చిమ్ మేదినీపుర్‌లోని ఖారగ్పుర్ సదార్ నియోజకవర్గంలో 72.68 శాతం ఓటింగ్ నమోదైంది.
మార్చి 27న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 84.63 శాతం ఓటింగ్ నమోదైంది.