అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్లో చెలరేగిన హింసపై కేంద్రం ఏర్పాటు చేసిన నిజనిర్ధరణ బృందం సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో మాట్లాడి నివేదికను అందించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఈ బృందం గురువారమే బంగాల్‌కు చేరుకున్నారు. రాష్ట్ర సీఎస్, హోం కార్యదర్శి, డీజీపీలతో సమావేశమయ్యారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో పర్యటించి... బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులతో మాట్లాడారు.
16 మంది మృతి
మే 2 తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నివేదిక అందించాలని బంగాల్ గవర్నర్‌ను కేంద్రం కోరింది. హింసకు కారణాలను శోధించాలని నలుగురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ హింసలో 16మంది మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. టీఎంసీ వర్గాలే దాడులకు పాల్పడ్డాయని భాజపా ఆరోపించగా.. వాటిని దీదీ కొట్టిపారేశారు. భాజపా గెలిచిన ప్రాంతాల్లోనే ఘర్షణలు జరిగాయని తిప్పికొట్టారు.