బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండగా.. అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. దీదీ ఒక విఫలమైన పాలకురాలు అని షా విమర్శించారు. రానున్న ఎన్నికలను.. నరేంద్ర మోదీ 'అభివృద్ధి నమూనా'కు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 'వినాశన నమూనా'కు మధ్య జరగనున్న పోరుగా అభివర్ణించారు. కూచ్‌బెహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
"నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాకు, మమతా బెనర్జీ వినాశన నమూనాకు మధ్య జరుగుతున్న సంగ్రామమే ఈ బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. భాజపా చేపట్టిన పరివర్తన యాత్ర.. ముఖ్యమంత్రిని మార్చడానికో లేదా మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చడానికో కాదు. చొరబాట్లను ఆపడానికి, బంగాల్ పరిస్థితిని మార్చేందుకే. అత్త, అల్లుళ్ల అవినీతిని అంతమొందించడం కూడా ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. టీఎంసీ గూండాలను అణచి వేసేందుకు భాజపా సిద్ధంగా ఉంది. భాజపా కార్యకర్తలను హత్య చేసిన నిందితులు ఊచలు లెక్కిస్తారు."
--అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
బంగాల్లో భాజపాను గెలిపిస్తే ఒక్క పక్షి కూడా సరిహద్దు దాటి అక్రమంగా రాలేదని అమిత్ షా అన్నారు. నాలుగో దశ పరివర్తన యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. 'జై శ్రీరామ్' అని నినదిస్తే కోప్పడే దీదీ.. ఎన్నికలు దగ్గరపడుతుండగా ఇప్పుడు ఆ మాటలనే జపిస్తున్నారని విమర్శించారు.