బంగాల్ అసెంబ్లీ నాలుగో దశ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. భద్రత కోసం 789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ.. దాడులు, ప్రతిదాడులు, ఘర్షణలతో పలు ప్రాంతాలు అట్టుడికాయి. అదే సమయంలో పోలింగ్‌కు భారీగా తరలివచ్చారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదైంది.
నలుగురు మృతి
పోలింగ్ సందర్భంగా కూచ్‌బిహార్ జిల్లా సితాల్‌కుచి రణరంగమైంది. జోర్‌పట్కీ ప్రాంతంలో ఓటర్లను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా.. భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. ఇరువర్గాలకు మధ్య ఘర్షణలు తలెత్తి అవి కాల్పులకు దారి తీశాయి. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు కేంద్ర పారిశ్రామిక దళం(సీఐఎస్ఎఫ్) జరిపిన కాల్పుల్లో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి
కాల్పుల ఘటనతో సితాల్‌కుచిలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాల్పులు జరపడానికి దారి తీసిన పరిస్థితులపై.. అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.
"సితాల్‌కుచిలోని 126వ పోలింగ్ కేంద్రం వద్ద 50 నుంచి 60 మందితో కూడిన ఓ బృందం.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఓటర్లను అడ్డుకున్నారు. తర్వాత కొందరు దుండగులు.. సీఐఎస్ఎఫ్ తక్షణ స్పందన దళానికి చెందిన వాహనంపై దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం తక్షణ స్పందన దళం.. గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాయి. గంట తర్వాత 150 మందితో ఉన్న ఓ గుంపు సితాల్‌కుచి సమీపంలోని మరో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పోలింగ్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఆపేందుకు ప్రయత్నించిన తమ ఉద్యోగి వద్ద నుంచి.. ఆయుధాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు ఉద్రేకంగా మారడం వల్ల గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల ఆత్మరక్షణ కోసం ఆందోళనకారులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు చేశారు."
-అధికారులు