తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లోనూ 'ఆపరేషన్​ శిందే!'.. భాజపాతో టచ్​లో 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు! - tmc bjp news

బంగాల్​ రాజకీయం కీలక మలుపు తిరగనుందా? మహారాష్ట్ర తరహా పరిణామాలకు వేదిక కానుందా? ఔననే అంటున్నారు నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి. టీఎంసీ మాత్రం ఆయన వాదనల్ని కొట్టిపారేసింది.

bengal politics news
బంగాల్​లోనూ 'ఆపరేషన్​ శిందే!'.. భాజపాతో టచ్​లో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!

By

Published : Jul 27, 2022, 6:00 PM IST

Updated : Jul 27, 2022, 6:15 PM IST

బంగాల్​లో అధికార తృణమూల్ కాంగ్రెస్​కు చెందిన 38 మంది శాసనసభ్యులు భాజపాతో టచ్​లో ఉన్నారని అన్నారు ఆ పార్టీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి. మహారాష్ట్రలో ఏక్​నాథ్​ శిందే వర్గం, భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహా పరిస్థితులు.. బంగాల్​లోనూ రావచ్చని కోల్​కతాలో జోస్యం చెప్పారు.

"టీఎంసీకి చెందిన కనీసం 38 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్​లో ఉన్నారు. వారిలో 21 మంది నాతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రలో శివసేన(ఏక్​నాథ్​ శిందే వర్గం), భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని నేను ముంబయిలో ఉండగా పత్రికలో చదివాను. ప్రస్తుతం భాజపా దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా అతి త్వరలోనే రెపరెపలాడుతుంది. బంగాల్​లో భాజపా తన పోరాటం ఆపదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తే.. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం" అని చెప్పారు మిథున్.

గతేడాది బంగాల్​ శాసనసభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు మిథున్. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలిచింది. మొత్తం 294 సీట్లున్న బంగాల్​ అసెంబ్లీలో టీఎంసీకి 216 మంది సభ్యులు ఉన్నారు. భాజపా తరఫున 75 మంది గెలిచారు. అయితే.. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే అధికార పక్షంలో చేరారు.

మభ్య పెట్టే ముచ్చట్లు:మిథున్ చక్రవర్తి వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది టీఎంసీ. వాస్తవికతకు, ఆయన ప్రకటనకు ఏమాత్రం సంబంధం లేదని.. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టే యత్నమని మండిపడింది. అసత్య ప్రకటనలతో ఆయన జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తింది.

మరోవైపు.. ఎస్​ఎస్​సీ కుంభకోణంలో బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. "భాజపాకు పని ఏమీ లేదు. 3-4 సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చడమే వారి పని. మహారాష్ట్రను అలానే దక్కించుకున్నారు. ఇప్పుడు ఝార్ఖండ్​లో చేస్తున్నారు. కానీ.. బంగాల్​ వారిని ఓడించింది. బంగాల్​ను దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే మీరు ముందుగా రాయల్ బంగాల్ టైగర్​తో పోరాడాలి" అని కోల్​కతాలో అన్నారు మమత. 2024లో కేంద్రంలో భాజపా తిరిగి అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Last Updated : Jul 27, 2022, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details