West Bengal Panchayat Election Violence : బంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లపై దాడులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు కార్యకర్తలు మృతి చెందినట్లు అధికార తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో.. తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దోమ్‌కోల్‌లో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలైనట్లు వెల్లడించింది. ఈ హింసకు ప్రతిపక్ష పార్టీలే కారణమని తృణమూల్ ఆరోపించింది.
కూచ్‌బిహార్ జిల్లాలో ఫాలిమరి గ్రామ పంచాయితీలో జరిగిన హింసలో భాజపా పోలింగ్ ఏజెంట్ మాదాబ్ బిశ్వాస్ చనిపోయినట్లు బీజేపీ తెలిపింది. అక్కడ బీజేపీ అభ్యర్థి మాయబర్మన్.. దాడిలో గాయపడ్డారు. తృణమూల్ గూండాలు బాంబు దాడి చేయడం వల్లే.. తమ ఏజెంట్ మృతి చెందినట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాయ చెప్పారు. అక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కాదమ్‌బాగచీ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని రాత్రి కొట్టి చంపినట్లు వివరించారు.
బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస పలు చోట్ల పోలింగ్ బూత్‌లో బ్యాలెట్లను ఎత్తుకెళ్లినట్లు, ఓటర్ల మీద దాడిచేసినట్లు అన్ని పార్టీలు ఆరోపించాయి. కూచ్‌బిహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ పత్రాలను దగ్ధం చేశారు. రాణినగర్‌లో తృణమూల్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో బంగాల్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది బంగాల్ పోలీసులను సైతం మోహరించారు. ఇన్ని కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ హింస ఎలా జరుగుతోందని అధికార తృణమూల్ ప్రశ్నించింది. మొత్తంగా వివిధ చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస Bengal Panchayat Election 2023 : 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు అగ్నిపరీక్షలా మారిన బంగాల్ పంచాయతీ ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. 22 జిల్లా పరిషత్‌లలోని 928 స్థానాలకు, 9,730 పంచాయతీ సమితులకు, 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5.67 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1970 చివర్లో బంగాల్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కేంద్ర బలగాల పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. 65వేల కేంద్ర రిజర్వ్‌డ్ పోలీసు సిబ్బందితో పాటు 70వేల మంది బంగాల్ పోలీసులను మోహరించారు. బంగాల్ జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. 42పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల అధికార, విపక్షాలకు, పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. శనివారం ఒకే దశలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు జూలై 11న జరగనుంది.