బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై భాజపా విమర్శల దాడి పెంచింది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధివైపు ఉంటారో.. లేక కమీషన్ల ప్రభుత్వంవైపు నిలుస్తారో తేల్చుకోవాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి 'లోకో సోనార్ బంగ్లా( బంగారు బంగాల్ సాధించటమే లక్ష్యం)' అనే కార్యక్రమాన్ని కోల్‌కతాలో ప్రారంభించిన నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్లో జన్మించిన ప్రముఖులను, మహిళలను మమత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ మేనిఫెస్టోలో మటువా వర్గం, మహిళలు, యువతకు పెద్ద పీట వేసి.. వారి సామాజిక, ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని తెలిపారు. కట్ మనీ, సిండికేట్ల సంస్కృతిని అంతం చేస్తామని పేర్కొన్నారు.
'లోకో సోనార్ బంగ్లా' ద్వారా ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తామని అన్నారు నడ్డా. ఈ కార్యక్రమం మార్చి 3వ తేదీన మొదలై.. అదే నెల 30 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.