బంగాల్ శాసనసభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్ స్థానమైన భవానీపుర్ సహా 34 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ముర్షీదాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలకు, పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో 9, దక్షిణ దినాజ్‌పుర్‌లో 6, మాల్డాలో 6, కోల్‌కతాలోని 4 నియోజకవర్గాలకు 12,068 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థుల్లో 37 మంది మహిళలు ఉన్నారు.
బంగాల్ దంగల్ ఏడో దశ
- శాసన సభ స్థానాలు: 34
- మొత్తం అభ్యర్థులు: 284
- ఓటర్లు: 86.7 లక్షలు
- పోలింగ్ కేంద్రాలు: 12,068
ప్రముఖుల పోరు..
ఈ ఎనిమిదో విడత పోలింగ్‌లో అందరి దృష్టి భవానీపుర్ నియోజకవర్గంపైనే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున ఈసారి శోభన్ దేవ్ ఛటర్జీ బరిలో ఉన్నారు. భాజపా అభ్యర్థి రుద్రనీల్ ఘోష్‌తో ఆయన పోటీ పడుతున్నారు.
కోల్‌కతా పోర్ట్ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్.. భాజపా అభ్యర్థి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాతో తలపడుతున్నారు.