Cattle smuggling scam: బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దర్యాప్తు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. మమత సన్నిహితుడు, భీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మండల్‌ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా బోల్‌పుర్‌లోని నివాసంలో ఈ అరెస్టు జరిగింది.
ఆ కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం అనుబ్రత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారి వెంట 30 కార్ల కాన్వాయ్ కూడా వచ్చింది. ఆయన్ను ఓ గదిలో ఉంచి గంటన్నరకు పైగా ప్రశ్నించింది. అయితే ఆయన విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు రావడంతో అనుబ్రత రెండో అంతస్తులో ఉన్న గదికి వెళ్లి, లోపలి నుంచి తాళం పెటుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అరెస్టు మెమోపై సంతకం చేయడానికీ నిరాకరించారని తెలిపాయి. పారా మిలిటరీ సిబ్బంది వచ్చి తలుపులు పగలగొడతారని హెచ్చరించడంతో గది బయటకు వచ్చినట్లు చెప్పాయి.
పశువుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి సీబీఐ అనుబ్రతకు 10 సార్లు సమన్లు జారీ చేసింది. ఆనారోగ్య సమస్యలను కారణంగా చూపి, దర్యాప్తు సంస్థ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏమీ లేదని కోల్‌కతాకు చెందిన ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి వెల్లడించడంతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రోజు ఆసనోల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
టీఎంసీ బాహుబలి:
మమతకు అనుబ్రత అత్యంత సన్నిహితుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఇచ్చిన ఖేలా హోబ్ నినాదానికి ఈయన ప్రాచుర్యం కల్పించారు. ఆ జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా ఆయన్ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి. పశువుల అక్రమ రవాణా కేసులో 2020లో సీబీఐ కేసు నమోదు చేయడంతో మండల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి భీర్‌భూం జిల్లాలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే సోదాలు నిర్వహించింది. మండల్ వ్యక్తిగత సంరక్షుడిని అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం మమత కేబినెట్‌లో పనిచేసిన పార్థా ఛటర్జీని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో ఆ అరెస్టు జరిగింది.