బంగాల్ దంగల్‌లో దీదీ వర్సెస్ సువేందు పోరు దాదాపు ఖరారైనట్లే. ఈ మేరకు ఎన్నికల కోసం 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ తాను కేవలం నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించి ఆసక్తికర పోరుకు తెరతీశారు దీదీ.
ఇదీ చూడండి:నందిగ్రామ్ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు
''నేను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నా. మార్చి 9న అక్కడికి వెళ్తా. మరుసటి రోజు హల్దియాలో నామినేషన్ దాఖలు చేస్తా. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా.. కేంద్ర బలగాలను ఎంతమందినైనా పంపించుకోండి. విజయం మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌దే.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
సువేందు రె'ఢీ'?
గతేడాది డిసెంబర్లో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరిన మమత అనుచరుడు, నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి.. మళ్లీ అదే చోట బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గురువారం సమావేశమైన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ.. సువేందుకు అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలపడమే తరువాయి. కీలక సమరానికి రంగం సిద్ధమైనట్లే.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: నందిగ్రామ్‌లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
ఈ పరిస్థితుల్లో దీదీ వర్సెస్ సువేందుగా మారిన బంగాల్ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.. అంతిమ విజయం ఎవరిదో ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: ఆ 109 సీట్లపై భాజపా గురి!
అప్పుడే పోటీపై ప్రకటన..
సువేందు కుటుంబానికి నందిగ్రామ్, జంగల్‌మహల్ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దీంతో ఆయన పార్టీ మారాక ఈ ప్రాంతంలో తృణమూల్ బలం కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య నందిగ్రామ్‌లో పర్యటించిన దీదీ.. వచ్చే ఎన్నికల్లో తాను ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి భాజపాకు సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: సువేందుపై మమత గురి- నందిగ్రామ్ నుంచి పోటీ
కంచుకోటలో దీదీకే సవాల్..
సీఎం సవాల్‌ను స్వీకరించిన సువేందు కూడా.. దీదీపై పోటీ చేసి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అదే రోజు ప్రకటించారు. మమతపై గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. ధైర్యముంటే భవానీపూర్ కాకుండా ఒక్క నందిగ్రామ్ నుంచే పోటీ చేయండంటూ దీదీకి ప్రతి సవాల్ విసిరారు. నందిగ్రామ్‌లో గెలుపుపై తాను ధీమాగా ఉన్నానని సువేందు హైకమాండ్‌కు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఇదీ చూడండి: బంగాల్ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?