Benapole Express Fire :బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పుపెట్టడం వల్ల నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అనేక మందికి కాలిన గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం (జనవరి 7న) దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది.
భారత్‌కు సరిహద్దున ఉన్న బెనాపోల్ పట్టణం బెనాపోల్ నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు కమలాపుర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 9గంటల ప్రాంతంలో చేరుకోగానే దుండగులు దాడి చేశారు. నాలుగు బోగీలకు నిప్పుపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలులో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారని, వారంతా ఎన్నికల కోసం భారత్ నుంచి స్వస్థలాకు తిరిగి వెళ్తున్నవారేనని అధికారులు తెలిపారు.
షేక్ హసీనా దిగ్భ్రాంతి
ఈ రైలు ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్‌పీ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా కుట్రపూరిత చర్యేనని, దీనిపై ఐరాస పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. గత డిసెంబరులోనూ బంగ్లాదేశ్‌లో రైలుకు దుండగులు నిప్పు పెట్టారు.