Beggars Leave Snakes in Train : ప్రయాణికులు బిచ్చం వేయలేదని రైల్లో పాములు వదిలారు కొందరు యాచకులు. పాములను ఆడించినా ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇలా చేశారు. దీంతో రైల్లో ఉన్నవారంతా భయంతో వణికిపోయి పరుగులు తీశారు. హావ్‌డా నుంచి గ్వాలియర్ వెళ్తున్న చంబల్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న సమయంలో జరిగింది ఈ ఘటన.
యాచకులు చేసిన పనికి ప్రాణభయంతో కొందరు బెర్తులపైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రైల్లో భయానక వాతావరణం నెలకొంది. యూపీలోని మహోబా జిల్లా మలక్‌పుర గ్రామం వద్ద.. పాములున్న బుట్టలతో నలుగురు వ్యక్తులు రైలెక్కారని ప్రయాణికులు తెలిపారు. అనంతరం పాములను బయటకు తీసి ఆడించి.. ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కాగా కొందరు ప్రయాణికులు వారికి డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంటూ గొడవకు దిగారు. దీంతో బుట్టల్లోని పాములను బోగీలో వదిలిపెట్టారు యాచకులు.
ఘటనపై కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన యాచకులు.. పాములను తిరిగి బంధించి, స్టేషను రాకముందే రైలు దిగి పరారయ్యారు. పోలీసు తనిఖీల అనంతరం రైలు తిరిగి గ్వాలియర్‌కు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని పోలీసులు తెలిపారు. ప్రయాణికులెవ్వరికీ హాని జరగలేదని వారు వెల్లడించారు. రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.