Bed Roll Kit For RAC Passengers In AC Trains : రైల్వే ఏసీ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ఆర్ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్ రైల్వే. ఇక నుంచి ఆర్ఏసీ టికెట్ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్ రోల్ కిట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ చెప్పారు. ఈ కిట్‌లో ఒక బెడ్‌షీట్, దుప్పటి, టవల్‌తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్ కార్ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.
ఈ బెడ్ రోల్ కిట్‌కు సంబంధించిన ఛార్జీలను ఆర్ఏసీ ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ రుసుములోనే చెల్లిస్తున్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను ఇప్పటికే అన్నీ జోన్ల జనరల్ మేనేజర్లకు పంపినట్లు శైలేంద్ర సింగ్ తెలిపారు. ప్రతి ఆర్ఏసీ( Reservation Against Cancellation ) ప్రయాణికుడికి ఈ సదుపాయం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన అన్నారు.
"ఈ బెడ్ రోల్ కిట్ సదుపాయం ఏసీ క్లాస్‌లలో(ఏసీ ఛైర్ కార్ మినహా) ప్రయాణించే ప్యాసింజర్లకు ఇబ్బంది కలగకుండా, వారిని కూడా ఇతర ప్రయాణికుల(కన్ఫర్మ్డ్ ప్యాసెంజర్స్)తో సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. వీటి ధరను కూడా నామమాత్రంగానే టికెట్ రుసుములోనే వసూలు చేస్తున్నాము. ఇది వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది."
- శైలేంద్ర సింగ్, రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్