Old Man Fight With Bear : ఎలుగుబంటితో ప్రాణాలకు తెగించి పోరాడాడు ఓ 72 ఏళ్ల వృద్ధుడు. 15 నిమిషాల పాటు దానితో భీకర యుద్ధం చేసి.. ఎట్టకేలకు బతికి బట్టకట్టాడు. అటవీ మార్గంలో ఒంటరిగా వెళుతున్న విఠల్ అనే వృద్ధుడిపై.. అకస్మాత్తుగా ఈ ఎలుగుబంటి దాడి చేసింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
జోయిడా తాలూకాలోని జగల్ పేటన తింబలిలో వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడు మాలోర్గి గ్రామానికి చెందిన వ్యక్తి. శుక్రవారం విఠల్ అటవీ మార్గంలో వెళుతుండగా.. ఎలుగుబంటి దాడి చేసింది. అనంతరం అప్రమత్తమైన విఠల్.. దానిపై ఎదురుదాడికి దిగి, ప్రాణాలకు తెగించి పోరాడాడు. తన బలం మొత్తాన్ని కూడగట్టుకుని 15 నిమిషాల పాటు ఎలుగుబంటిని ఎదిరించిన ఆ వృద్ధుడు.. చివర్లో గట్టిగా అరిచాడు. దీంతో ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది.
విఠల్‌కు తీవ్ర గాయాలు..
ఎలుగుబంటి దాడిలో విఠల్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిలో అతడికి ఓ కన్నుపోయింది. మరో కన్నుకు కూడా తీవ్రంగా గాయమైంది. శరీరానికి, తలకు చాలా గాయాలయ్యాయి. అయినా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ.. బంధువుల ఇంటికి చేరాడు విఠల్. వృద్ధుడి పరిస్థితిని గమనించిన బంధువులు.. జరిగింది తెలుసుకుని అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. మొదట రామ్‌నగర్ హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమించిన కారణంగా బెళగావి ఆసుపత్రికి తరలించారు.