రైతులు తమ పొలాలను చూసుకునేందుకు వెళ్లిపోతారని.. దీంతో రైతు ఉద్యమం ముగిసిపోతుందనే భ్రమలో కేంద్రం ఉండొద్దని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను సైతం తగలబెట్టడానికైనా రైతులు సిద్ధంగా ఉన్నారని టికాయిత్ ప్రకటించారు. చట్టాలను రద్దు చేసేంత వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు.
'రైతులుగా మేము వ్యవసాయమూ చేస్తాం.. ఆందోళనలూ కొనసాగిస్తాం' అని టికాయిత్ ఉద్ఘాటించారు. చట్టాలు రద్దు చేసేంతవరకు 'ఘర్‌వాపసీ'ఉండబోదని కుండబద్దలు కొట్టారు. హరియాణా హిసార్ జిల్లా పరిధి ఖరక్పూనియా గ్రామంలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రైతు సంఘాలు తదుపరి పోరాటానికి పిలుపునిచ్చే ఆందోళనల్లో పాల్గొనేందుకు అన్నదాతలు సమాయత్తం కావాలని టికాయిత్ సూచించారు. ఏ సమయంలోనైనా పిలుపు రావొచ్చని.. దిల్లీకి ప్రయాణించడానికి ట్రాక్టర్లలో ఇంధనాన్ని నింపి సిద్ధంగా ఉండాలన్నారు.