దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాట్లా హౌస్ ఎన్కౌంటర్' కేసులో ఇండియన్ ముజాహిదీన్ వ్యక్తిని దోషిగా తేల్చింది దిల్లీ కోర్టు. 2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్ ఖాన్, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్ యాదవ్ తెలిపారు. అయితే.. నిందితుడికి ఏ శిక్ష వేయాలనేదానిపై ఈ నెల 15న విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ కేసు..
2008లో.. దిల్లీలో ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్‌లోని బాట్లా హౌస్ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల.. ఇన్స్పెక్టర్ ఎంసీ శర్మ అమరుడయ్యారు. అనంతరం.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే.. ఈ కేసుతో సంబంధమున్న ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు.. 2013 జులైలో జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. ఆ తర్వాత.. 2018లో ప్రధాన నిందితుడు అరిజ్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు.
ఇదీ చదవండి:23 ఏళ్ల తర్వాత మళ్లీ యుద్ధనౌకల్లో నారీ శక్తి