Bathukamma Festival 2023 Special Naivedyam For 9 Days :తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పల్లె పట్నం అని తేడా లేకుండా.. రాష్ట్రమంతటా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. అక్టోబరు 14 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే పండుగ.. చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అయితే.. ఈ తొమ్మిది రోజుల్లో బతుకమ్మకు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bathukamma Festival 2023 Special Naivedyam For 9 Days : బతుకమ్మ పండుగ.. 9 రోజులు నైవేద్యంగా ఏం పెడతారు..? - బతుకమ్మ నైవేద్యం ఎన్ని రోజులు పెడతారు
Bathukamma Festival 2023 Special Naivedyam For 9 Days : తెలంగాణ ఆత్మగా భావించే పండుగల్లో బతుకమ్మది విశిష్ట స్థానం. ఈ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవాలు మొదలవుతాయి. మరి, ఈ తొమ్మిది రోజుల్లో గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం పెడతారు..? వేటితో తయారు చేస్తారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Published : Oct 13, 2023, 12:47 PM IST
ఎంగిలి పూల బతుకమ్మ :మొదటి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఇది మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది. దీనిని తెలంగాణలో పెత్రామస (పితృఅమావాస్య) అని అంటారు. ఈ రోజున.. గౌరమ్మకు నైవేద్యంగా నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి పెడతారు.
అటుకుల బతుకమ్మ : రెండో రోజున నిర్వహించే బతుకమ్మను "అటుకుల బతుకమ్మ"గా పిలుస్తారు. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ఉంటుంది. అటుకుల బతుకమ్మ రోజున అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో వండిన పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ పేరుతో పండుగను నిర్వహించుకుంటారు. ఈ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి చేసిన పదార్థాలను నైవేద్యంగా నివేదిస్తారు.
అట్ల బతుకమ్మ : ఐదవ రోజున అట్ల బతుకమ్మ పండుగ చేస్తారు. అట్లు లేదా దోశలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ : ఆరవ రోజున అలిగిన బతుకమ్మ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తారు. బతుకమ్మ అలిగింది అని భక్తులు విశ్వసించి, ఆరవ రోజున ఎటువంటి నైవేద్యమూ అమ్మవారికి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ :ఏడవ రోజు నిర్వహించే ఉత్సవం పేరు పేరు వేపకాయల బతుకమ్మ. ఈ రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ :ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ పండుగ ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా అందిస్తారు.
సద్దుల బతుకమ్మ : బతుకమ్మ పండుగ చివరి రోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు ఆశ్వయుజ అష్టమి. అదే విధంగా దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాలైన వంటకాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ఆడపడుచులు ఆటపాటలతో తొమ్మిది రోజులపాటు బతుకమ్మను పూజిస్తూ.. బతుకమ్మను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు. అనంతరం పసుపుతో గౌరమ్మను తయారు చేస్తారు. నిమజ్జనం తరవాత పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ పుస్తెలకు పూసుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ మాంగళ్యం పది కాలాల పాటు సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు.