Bathinda Military Station Firing : పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనికస్థావరంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు సోమవారం మోహన్ దేశాయ్ అనే జవాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు బఠిండా సీనియర్ పోలీసు సూపరిండెంట్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ కేసులో తమను తప్పుదోవ పట్టించిన జవాన్ మోహన్ దేశాయ్ నిందితుడని, అతడే కాల్పులు జరిపినట్లు చెప్పారు. నిందితుడు సైనిక స్థావరంలో గన్నర్‌గా విధులు నిర్వహించేవాడని, వ్యక్తిగత కారణాలతోనే కాల్పులు జరిపాడని తెలిపారు. మృతి చెందిన జవాన్లతో మోహన్ దేశాయ్‌కి వ్యక్తిగత విరోధం ఉన్నట్లు ఎస్‌ఎస్పీ పేర్కొన్నారు.
ఏప్రిల్ 12 తెల్లవారుజామున బఠిండా సైనిక స్థావరంలోని మిలిటరీ స్టేషన్‌లోని శతఘ్ని విభాగానికి చెందిన బ్యారెక్స్‌లో నలుగురు జవాన్లు నిద్రిస్తుండగా కాల్పుల ఘటన జరిగింది. ఆ తర్వాత బ్యారెక్స్ నుంచి కుర్తా-పైజామా ధరించిన ఇద్దరు ముఖానికి మాస్క్‌లతో బయటకు వెళ్లినట్లు నిందితుడు మోహన్ దేశాయ్ తెలిపాడు. ఆగంతుకుల్లో ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి చూసినట్లు సైనికాధికారులకు చెప్పాడు. ఈ కాల్పుల ఘటనపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షిగా ఉన్న మేజర్ అషుతోశ్ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మోహన్ దేశాయ్‌ను విచారించగా.. అతడు నేరం అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత తగాదాల వల్లనే సహోద్యోగులను కాల్చినట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు పేర్కొన్నాయి.