school Children joining Naxalite organization: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి కారణంగా పాఠశాల విద్యార్థులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. భారత్‌లో కొవిడ్ మూడో దశ నేపథ్యంలో స్కూళ్లకు పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ సంస్థలు స్కూల్ పిల్లలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ వెల్లడించారు. పాఠశాల దశలోనే విద్యార్థులను మావోయిస్టులుగా మార్చి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కరోనా కట్టడి కోసం బస్తర్‌లోని పాఠశాల ఆశ్రమాలను గత రెండేళ్లుగా మూసివేశారు. దీన్ని అదునుగా తీసుకున్న నక్సలైట్లు విద్యార్థులను ప్రలోభ పెట్టి తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై మాకు కచ్చితమైన సమాచారం ఉంది. అయితే ఎంత మంది పిల్లలు ఇప్పటికే నక్సల్స్ సంస్థల్లో చేరి ఉంటారని అంచనా వేయలేకపోతున్నాం. పాఠశాల ఆశ్రమాలకు తిరిగి వచ్చిన విద్యార్థులను తమ స్నేహితుల గురించిన వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నక్సలైట్లు అభివృద్ధికి, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. కరోనా సమయంలో వారి అసలు రూపం ఏంటో అందరికీ తెలిసింది. నక్సల్స్ సంస్థల్లో చేరిన విద్యార్థులను తిరిగి తీసుకువచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేస్తాం.