తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక నూతన సీఎం రాజకీయ ప్రస్థానమిదే.. - కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్​ బొమ్మై నియామకమయ్యారు. ఈ మేరకు భాజపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్న బొమ్మై రాజకీయ ప్రస్థానమేంటో తెలుసుకుందాం..

bommai, karnataka cm
బొమ్మై, కర్ణాటక సీఎం

By

Published : Jul 27, 2021, 9:53 PM IST

యడియూరప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా యడ్డీ స్థానంలో బసవరాజ్ సోమప్ప బొమ్మై పేరును ఖరారు చేసింది భాజపా కోర్ కమిటీ. దీంతో మరోసారి లింగాయత్​ వర్గానికే కన్నడ సీఎం పీఠం దక్కినట్లైంది.

ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్​.. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

బొమ్మై వ్యక్తిగత వివరాలు..

1960 జనవరి 28న హుబ్లీలో జన్మించారు బసవరాజ్​ బొమ్మై.

  • వయసు: 61 ఏళ్లు
  • భార్య: చెన్నమ్మ బి. బొమ్మై
  • తండ్రి:ఎస్​ఆర్​ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి
  • తల్లి: గంగమ్మ ఎస్ బొమ్మై
  • పిల్లలు:కుమారుడు, కుమార్తె
  • చదువు: బీఈ మెకానికల్

రాజకీయ ప్రస్థానం..

కళాశాలలో చదువుకునే రోజుల్లోనే జనతా దళ్​ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బసవరాజు బొమ్మై.

  • 1995లో జనతా దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
  • 1996-97 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జేఎచ్ పటేల్.. బసవరాజ్​ను రాజకీయ కార్యదర్శిగా నియమించుకున్నారు.
  • 1998, 2008లో ధారవాడ​ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు.
  • 2007లో ధారవాడ నుంచి నరగుండ వరకు 232 కిలోమీటర్లు రైతుల కోసం పాద యాత్ర చేశారు.
  • 2008లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
  • 2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 2008 జూన్ 7- 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు నిర్వహించారు.
  • 2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు రాష్ట్ర సహకార మంత్రిగా విధులు.
  • 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు.

హవేరి, ఉడుపి జిల్లాలకు కూడా బాధ్యత వహించారు బొమ్మై. రైతుగా, వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన నీటిపారుదలపై అపారాజ్ఞానం సంపాదించారు. దేశంలో తొలిసారిగా షిగ్గావ్​ ప్రాంతంలో 100శాతం నీటిపారుదల ప్రాజెక్టును విజయవంతం చేశారు.

గొప్ప మనసున్న నేత..

బసవరాజ్ బొమ్మై​ గొప్ప మనసున్న నేత. కరోనా రెండో దశలో ఆయన చేసిన సేవ ఇందుకు ఉదాహరణ. కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు వెలుగుచూసిన మే నెలలో.. హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ)గా మార్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చినట్లు ఆయన కార్యాలయం ఆనాడు పేర్కొంది.

ఇదీ చదవండి:గవర్నర్​ పదవికి యడ్డీ నో- కొత్త పార్టీ పెడతారా?

ABOUT THE AUTHOR

...view details