Baramulla Encounter Update :ఉగ్రవాదుల ఏరివేతకు జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో.. సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు.. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదులకు.. భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. హత్‌లంగా ఏరియాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని.. అనంతరం జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు ఇద్దరు ఉద్రవాదుల మృదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వీరు పాకిస్థాన్ వైపు ఉన్న పోస్ట్ నుంచి కాల్పులు జరపడం వల్ల మూడో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేయడానికి ఇబ్బంది ఎదురవుతోందని భద్రతా దళాలు తెలిపాయి. అపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పాయి. హతమైన ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని.. అయితే వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో నిర్ధరించలేదని తెలిపాయి.
Anantnag Encounter Updates :జవాన్ల ప్రాణాలు తీసిన ముష్కరులను ఏరివేయడానికి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్.. శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గఢాల్ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగంలోకి దించింది. డ్రోన్‌లతో ఉగ్రమూకల స్థావరాలను గుర్తించి.. వారిని మట్టుబెడతామని కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఉగ్రమూకలు దాక్కున్నారని భావిస్తున్న కొండ ప్రాంతాలవైపు భద్రత బలగాలు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించాయి. ముష్కరులు నక్కినట్లు భావిస్తున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టామని విజయ్‌కుమార్ తెలిపారు.