'న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకు కీలకపాత్ర ఉంది. న్యాయ వ్యవస్థ పనితీరుపై ప్రభావంచూపేలా ఏవైనా దాడులు జరిగితే వాటి నుంచి రక్షణ కల్పించాల్సింది వారే' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ పదవీ విరమణ సందర్భంగా వివిధ బార్ అసోసియేషన్లు కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'మనుషుల భావనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. సమావేశాలు, వీడ్కోలు కార్యక్రమాల్లో అవి మరింత ప్రకాశిస్తాయన్నది జర్మన్ నానుడి. విలువైన సహచరుడు అశోక్‌భూషణ్‌కి వీడ్కోలు పలుకుతున్నాం. ఒక గొప్ప సహచరుడిని, ఆయన విలువైన సాంగత్యాన్ని కోల్పోతున్నందుకు బాధగా ఉంది' అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.
జస్టిస్ అశోక్ భూషణ్ గొప్ప న్యాయమూర్తిగానే కాకుండా, అత్యుత్తమ వ్యక్తిగా ప్రత్యేకత సంతరించుకున్నారని పేర్కొన్నారు. ఆయన బార్, బెంచ్ రెండింటినీ సమానంగా గౌరవించినట్లు తెలిపారు.