తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Student Murder: అమర్నాథ్‌ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. హంతకులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్​ - పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్​ పోసి

Bapatla SP on Tenth Class Student Murder: పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఘటనలో నలుగురు పాల్గొన్నారని.. అందులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్​ జిందాల్​ వివరించారు. మరోవైపు అమర్​నాథ్​ స్వగ్రామం ఉప్పాలవారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ హామీతో అమర్​నాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Bapatla SP on
Bapatla SP on

By

Published : Jun 17, 2023, 12:05 PM IST

Updated : Jun 18, 2023, 7:55 AM IST

అమర్నాథ్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత

Tenth Class Student Murder: అక్కను వేధిస్తున్నారేమని అడగడమే ఆ చిన్నారి పాలిట మరణశాసనమైంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని చిన్నవయసులో చేసిన ప్రయత్నం.. అతడి ప్రాణాలు తీసింది. అరాచకశక్తుల దాష్టీకానికి ఆ కుటుంబం అండను కోల్పోయింది. పదో తరగతి చదువుతున్న బాలుడు ఉప్పాల అమర్నాథ్‌ దారుణ హత్యపై బాపట్ల జిల్లాలో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. వైకాపా అల్లరిమూకలే హత్య చేశాయని, ఆ పార్టీ నాయకులు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిరసనలు పెల్లుబికాయి. బాలుడి మృతదేహంతో గంటన్నరకు పైగా స్థానిక ఐలాండ్‌ సెంటర్‌లో బాధిత కుటుంబసభ్యులు, గౌడసేన, బీసీ సంఘాలు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలో రహదారిపై బైఠాయించి హంతకులకు ఉరిశిక్ష వేయాలన్న డిమాండుతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు నుంచి ఉదయం 11.30 ప్రాంతంలో అంబులెన్సులో అమర్నాథ్‌ మృతదేహాన్ని బాలుడి స్వగ్రామం ఉప్పాలవారిపాలెం తీసుకెళ్తుండగా మండల కేంద్రం చెరుకుపల్లికి చేరుకుంది. మృతుడి కుటుంబీకులు, బంధువులు అంబులెన్సును అడ్డుకొని అందులోంచి మృతదేహాన్ని కిందకు దించి ఆందోళన చేశారు. మృతదేహంతో స్టేషన్‌ వద్దకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. వాటిని నెట్టుకొని ముందుకెళ్తుండగా పోలీసులు ఆందోళనకారుల్ని వెనక్కు నెట్టేయడంతో రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుమీద కూర్చున్నారు. మిగిలిన ఆందోళనకారులూ ఆయనతో పాటు బైఠాయించి 2గంటల పాటు ఆందోళన కొనసాగించారు.

హంతకులను అప్పగించాలని డిమాండు: తన అక్కను వేధిస్తున్నారని నిలదీసిన పాపానికి బాలుడిని అత్యంత పాశవికంగా కొట్టి పెట్రోలు పోసి దారుణంగా హతమారిస్తే... నిందితులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. నిందితులకు వైకాపా నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే వారు అంతలా తెగబడ్డారని, వారిని అరెస్టు చేయడం కాదని.. తమకు అప్పగించడమో, లేదా పోలీసులు వెంటనే ఉరితీసి తమకు తక్షణన్యాయం చేయాలని పట్టుబట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆందోళన విరమించాలని ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్‌ వచ్చారు. ఎలా న్యాయం చేస్తారో కలెక్టర్‌, ఎస్పీ వచ్చి స్పష్టమైన హామీనివ్వాలని బాధితులు పట్టుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వానికి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై నివేదిక పంపామని, వారి అనుమతి మేరకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని ఆర్డీవో పార్థసారథి, డీఎస్పీ మురళీకృష్ణ కోరినా ససేమిరా అన్నారు. చివరకు అధికారులు ఎమ్మెల్యేతో మాట్లాడి కలెక్టర్‌కు ఫోన్‌ చేయించారు.

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయంతో పాటు ఇల్లు కట్టిస్తామని, అమ్మాయి చదువు పూర్తికాగానే ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ విషయాల్ని ఆర్డీవో పార్థసారథి ఆందోళనకారులకు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సొంతూరికి తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పాడె మోశారు.

రాజకీయ కోణం లేదు.. వ్యక్తిగతంగా మాత్రమే: తన అక్కను వేధిస్తున్నట్లు అమర్నాథ్ ప్రచారం చేస్తున్నారనే ఆగ్రహంతో హత్య చేశారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించామని.. హత్య ఘటనలో రాజకీయ కోణం ఏమీ లేదు.. కేవలం వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని తెలిపారు. హత్య ఘటన ఉదయం 5.30 గం.కు జరిగిందని.. అమర్నాథ్ కేకలు విని సమీపంలో ఉన్నవారు వచ్చారని వివరించారు. కేకలు విని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని.. గతంలో ఈ గొడవకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేదన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అనుమానితులను అరెస్టు చేశామని.. క్లూస్ టీం రెండుసార్లు ఘటనాస్థలిని పరిశీలించిందని వెల్లడించారు.

ఎంపీ మోపిదేవి అడ్డగింత:బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణను అడ్డుకున్నారు. గ్రామంలోకి రానీయకుండా ఎంపీ మోపిదేవిని నిలువరించారు. అమర్నాథ్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఆందోళనతో బాధిత కుటుంబం వద్దకు వెళ్లకుండానే వెంకటరమణ వెనుదిరిగారు.

అమర్​నాథ్​ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది: అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ తరఫున రూ.5 లక్షలు సాయం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అమర్‌నాథ్‌ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ హామీ ఇచ్చారు. హంతకుడిని కాపాడేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశం: విద్యార్థి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్​ తెలిపారు. ఈ ఘటనపై​ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో అవాంఛనీయ ఘటన జరిగిందని.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు పాల్గొన్నారని.. వారిపై హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డితో పాటుగోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి ఈ హత్యలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు.

Last Updated : Jun 18, 2023, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details