Arrest warrants against farmers: రుణాలు తీసుకున్న రైతులపై చర్యలు చేపట్టింది పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం. వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2000 మంది రైతులపై ఈ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇందులో కొందరికి కొత్తగా జారీ చేయగా, మరికొందరి వారెంట్లును రెండోసారి జారీ చేశారు. రైతుల నుంచి రూ.3200 కోట్లు వసూలు చేయనున్నట్లు సమాచారం.
రైతులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆందోళనకు దిగేందుకు కర్షకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు కొనసాగితే తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు పలువురు రైతులు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించలేదు. రుణాల వసూలులో భాగంగా ఫిరోజ్‌పుర్ రైతులపై చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇందులో బస్తి రామ్వారాకు చెందిన బఖ్షిష్ సింగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. తాను నెలరోజుల్లోపు రుణాలు చెల్లిస్తానని హామీ ఇవ్వటం వల్ల విడిచిపెట్టారు. ఒక్క ఫిరోజ్‌పుర్ జిల్లాలోనే 250 మంది కర్షకులపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.