Varun Gandhi: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈసారి నిరుద్యోగ సమస్య, జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధానాలపై ప్రశ్నించారు. కార్పొరేట్లకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయని, యువత, రైతులకు మొండి చేయి చూపిస్తాయని విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్, బరేలీ జిల్లాలోని బహేరి తహసీల్లో పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"రూ.1000 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న పారిశ్రామికవేత్తలకే బ్యాంకులు 80 శాతం రుణాలు ఇస్తాయి. మిగిలిన 20 శాతంలో 11 శాతం రూ.50 కోట్లపైన టర్నోవర్ ఉన్న చిన్న పరిశ్రమలకు అందిస్తాయి. దేశంలోని యువత, రైతులు, కూలీలకు ఎంత శాతం రుణాలు కేటాయిస్తున్నారనే విషయంపై ఆయా జాబితాలను పరిశీలించగా కీలక విషయాలు తెలిశాయి. కేవలం 9శాతం మాత్రమే లోన్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు యువతకు ఇతర ఉపాధి మర్గాలు ఏమిటి అనేదే పెద్ద ప్రశ్న. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. "
- వరుణ్ గాంధీ, భాజపా ఎంపీ.