Bank Robbery In Manipur :మణిపుర్‌లో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. మాస్కులు ధరించి వచ్చిన దుండగులు ఉఖ్రుల్ జిల్లా కేంద్రంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. బ్యాంకులోని ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేసి రూ.18.80కోట్లతో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి అధునాతన ఆయుధాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించారు. ఆర్‌బీఐ, ఏటీఎంలకు పంపేందుకు నగదును ఈ బ్యాంకులోనే నిల్వ చేస్తుంటారు. ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్‌కు 80కి.మీల దూరంలో ఉంటుంది. దీనిపై కన్నేసిన దొంగలు గురువారం సాయంత్రం బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. వారందరినీ వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి బంధించారు. వీరిలో సీనియర్ ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఖజానాను బలవంతంగా తెరిపించారు. అందులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకొనేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
బంగారు, వెండి అభరణాలను దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి రూ.5 లక్షల విలువైన అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జమ్ములో జరిగింది.