Bangalore Bandh Today : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 'శక్తి గ్యారెంటీ' పథకంపై ప్రైవేటు రవాణా ఆపరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
ర్యాలీ చేపడుతున్న ఆందోళనకారులు అయితే బెంగళూరులోని నిరసన స్థలానికి చేరుకున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి.. ఆందోళనకారుల వినతిపత్రాన్ని స్వీకరించారు. పలు హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్ల సమస్యలపై తాము యూనియన్‌తో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖంద్రే పేర్కొన్నారు. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు మీడియాకు చెప్పారు.
బెంగళూరుపై ప్రభావం ఎక్కువ..
ప్రైవేట్ ఆపరేటర్ల బంద్ ప్రభావం బెంగళూరుపై అధికంగా ఉంది. సామాన్య ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆటోలు, ప్రైవేటు బస్సులపై ఆధారపడే వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి తన ఇంటికి బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. ఈ మేరకు బస్సులో ప్రయాణిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.
ర్యాలీలు.. సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు..
అయితే బంద్ రోజున వాహనాలు నడుపుతున్న ఆటో, క్యాబ్, ర్యాపిడో, ట్యాక్సీ డ్రైవర్లపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. సంగొల్లి రాయన్న ఫ్లైఓవర్‌పై రాపిడో డ్రైవర్‌ను అడ్డుకున్న పది మంది ఆందోళనకారులు.. ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే తాను అప్పు చేసి బైక్ కొనుగోలు చేశానని.. అందుకే బంద్ రోజు కూడా సర్వీస్ ఇస్తున్నట్లు వాపోయాడు. ర్యాపిడో బైక్, ట్యాక్సీ, ఓలా, ఉబర్ క్యాబ్ కంపెనీల డ్రైవర్లు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Karnataka Bandh Reason :ప్రభుత్వ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చిన 'శక్తి పథకం' వల్ల ప్రైవేట్ వాహనాల్లో సంచరించే ప్రయాణికులు తక్కువయ్యారని ప్రైవేటు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ర్యాపిడ్ బైకు ట్యాక్సీలతో తమ వ్యాపారం మరింత క్షీణించిందని, తమ సమస్యలకు ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10వేల పరిహారం, అసంఘటిత డ్రైవర్లకు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్, బెంగళూరు విమానాశ్రయం వద్ద ఇందిరా క్యాంటీన్ ఏర్పాటు, డ్రైవర్లకు గృహ వసతి, వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం, ప్రైవేట్ బస్సులకు శక్తి పథకాన్ని అన్వయించడం, ర్యాపిడ్ బైక్ సేవలను నిలుపుదల వంటి పలు డిమాండ్లతో బంద్ చేపట్టారు.