తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీXభాజపా: బరిలో ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు! - బంగాల్ ఎన్నికల పోరు

బంగాల్​ శాసనసభ పోరులో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భాజపా-తృణమూల్​ ఎలాగైనా గెలవాలని వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇరు పార్టీలు పలు చోట్ల ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పశ్చిమ మిడ్నాపూర్​ జిల్లాలోని దేబ్రా నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఐపీఎస్​లు తలపడనున్నారు.

bjp Vs tmc
టీఎంసీ Vs భాజపా.. ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు!

By

Published : Mar 7, 2021, 7:14 AM IST

బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా అక్కడ నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. హ్యాట్రిక్‌ కొట్టాలని దీదీ.. బంగాల్​‌లో ఈసారి ఎలాగైనా పాగా వేయాల్సిందేనన్న పట్టుదలతో భాజపా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలోనూ పదునైన వ్యూహాలతో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దేబ్రా నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలూ ఇద్దరు మాజీ ఐపీఎస్‌లను బరిలో దించడమే ఇందుకు నిదర్శనం.

ఎస్పీ హుమయూన్‌ కబీర్‌..

పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని దేబ్రా నియోజకవర్గంలో ఈసారి టీఎంసీ, భాజపా మధ్య తీవ్రంగా పోటీ జరగనుంది. ఆ రెండు పార్టీలూ ఇక్కడి నుంచి ఇద్దరు మాజీ ఐపీఎస్‌లను బరిలో దించి రాజకీయ వేడి పుట్టించాయి. హుమయూన్‌ కబీర్‌ను అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో నిలపగా.. భాజపా కూడా అందుకు దీటైన అభ్యర్థినే పోటీలో పెట్టింది. మాజీ ఐపీఎస్‌ అధికారి భారతీ ఘోష్‌ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. చందన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి రాజీనామా చేసిన హుమయూన్‌ కబీర్‌ గత నెలలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. చందన్‌నగర్‌లో నందిగ్రామ్‌ భాజపా అభ్యర్థి సువేందు అధికారి నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో గోలీమార్‌ నినాదాలు చేసిన ముగ్గురు భాజపా కార్యకర్తలను అరెస్టు చేసి ఆయన వార్తల్లో నిలిచారు.

మరోవైపు, భారతీఘోష్‌ కూడా గతంలో జార్‌గ్రామ్‌ జిల్లా పోలీస్‌ బాస్‌గా పనిచేశారు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఆమెకు పేరుంది. ఓ బహిరంగ కార్యక్రమంలో దీదీని అమ్మగా కూడా సంబోధించారామె. అయితే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాషాయ దళంలో చేరి ఈ ఎన్నికల్లో టికెట్‌ సాధించారు.

ఇదీ చదవండి:అసోం, బంగాల్​ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ABOUT THE AUTHOR

...view details