Bandipur twin elephant: నీటి గుంతలో కవల ఏనుగు పిల్లలకు జన్మనిచ్చింది ఓ ఏనుగు. ఆ బుజ్జి ఏనుగులు అందులో మునిగిపోతుండగా అటవీ శాఖ అధికారులు రెస్క్యూ అపరేషన్ నిర్వహించి వాటిని కాపాడారు. ఈ ఘటన కర్ణాటకలోని బందీపూర్ అడవిలో జరిగింది.
ఈ ఏనుగు పిల్లలను కాపాడడం కోసం అటవీ శాఖ అధికారులు 'ఆపరేషన్ ట్విన్స్' పేరుతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం తల్లి ఏనుగు తమపై దాడి చేయకుండా.. ఏనుగు పిల్లల నుంచి దానిని దూరంగా తరమడం కోసం ఏర్పడగా, మరో బృందం ఏనుగు పిల్లలను నీటి గుంత నుంచి బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ గుంతలో నుంచి ఏనుగు పిల్లలను పైకి ఎక్కేలా చేశారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తల్లి ఏనుగు వద్దకు పిల్ల ఏనుగులను సురక్షితంగా చేర్చారు అధికారులు. క్షేమంగా బయటపడ్డ పిల్లలతో అడవిలోకి వెళ్లిపోయింది ఆ ఏనుగు.