BJP Leaders Meets With Ponguleti Srinivas Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరొందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలో ఉన్నప్పటి నుంచే కేసీఆర్‌పై, పార్టీ తీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్న ఆయన త్వరలోనే వేరే పార్టీలో చేరతారనే ఉహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో బలమైన క్యాడర్ ఉన్న పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోవాలని ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలో పొంగులేటిని సంప్రదించి తమ పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది.
పొంగులేటితో ఈటల భేటీ గురించి నాకు తెలియదు : బండి సంజయ్ - పొంగులేటితో ఈటల భేటీపై బండి సంజయ్ కామెంట్స్
12:26 May 04
పొంగులేటితో బీజేపీ నేతల సంప్రదింపులపై సంజయ్ కీలక వ్యాఖ్యలు
అయితే పొంగులేటి విషయంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ కాంగ్రెస్ కంటే ముందే పావులు కదిపింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన బృందంతో ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఇప్పటికే ఈటల, డీకే అరుణ పొంగులేటితో తమ పార్టీలో చేరికపై చర్చించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పొంగులేటి ఇంటికి ఈటల రాజేందర్ బీజేపీ చేరికల కమిటీనే తీసుకొని వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం భిన్నంగా స్పందించారు.
పొంగులేటితో బీజేపీ నేతల సంప్రదింపులపై సంజయ్ కీలక వ్యాఖ్యలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారన్న విషయం తనకు తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మాటలు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనడంతో హాట్‌టాపిక్‌గా మారాయి. తన వద్ద ఫోన్ లేదని.. అందుకే తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం అందలేదని బండి తెలిపారు. ఆయనతో చర్చలు విషయం.. తనకు చెప్పకపోవడం తప్పేం కాదని బహిరంగంగానే చెప్పారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళతారని అన్నారు. తనకు తెలిసిన వారితో తాను మాట్లాడతానని.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడతారని వివరించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వస్తే అతనిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవడానికి ఎవరినైనా కలుపుకు పోతామని బండి సంజయ్ చెప్పారు.
పొంగులేటి చేరికపై ఉత్కంఠ: ఓ వైపు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ నేతలు ఆ దిశగా ముందుకు వెళ్తుంటే.. మరోవైపు పొంగులేటి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ రేకెత్తింది. పొంగులేటి నిర్ణయం కోసం ఆయన అనుచరులు, ఖమ్మం జిల్లా నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పొంగులేటి ఈ విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేలా లేరని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
TAGGED:
BANDI SANJAY