Bandi Sanjay React on Chandrababu Naidu Arrest :టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Arrest) అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ఆయన అరెస్టును జాతీయ నేతలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) సైతం స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం సరైందికాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.
National Leaders Condemned CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన జాతీయ నేతలు
Kishanreddy React on TDP Chief Arrest : అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సైతం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ విషయంపై ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమాచారం అందించారని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అరెస్టు చేశారన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు సబబు కాదని బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఆయనను అరెస్టు చేయడం బీజేపీ ఖండిస్తోందని దిల్లీలో నిర్వహించిన సమాచారంలో తెలిపారు.