Bandi Sanjay Comments on BRS and YSRCP: బీఆర్ఎస్.. వైఎస్ఆర్సీపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మాబొరుసు లాంటివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పరస్పరం సాయం చేసుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం కొనేంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే... బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించి.. రైతులకు న్యాయం చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు.
"వైసీపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మాబొరుసులాంటివి. పరస్పర స్వార్థ ప్రయోజనాల కోసం సాయం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ.. రెండు చోట్లా సెంటిమెంట్ రగిలిస్తున్నాయి. స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కొనేంత డబ్బుంటే బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా. నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీజేపీ నేతలు: మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం.. తెలంగాణ బీజేపీ నాయకులను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా తెలంగాణ నేతలను నియమించింది. ఇప్పటికే తమకు అప్పగించిన నియోజకవర్గాలకు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్.కుమార్ ప్రచారపర్వంలో పాల్గొంటున్నారు. లక్ష్మణ్‌తో పాటు మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజక వర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది. 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇంఛార్జీలను నియమించింది.