Rakesh Surana: కోటీశ్వరులు తమ యావదాస్తిని దానం చేసి నిరాడంబర జీవితం గడిపే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ప్రముఖ ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. అంతేకాదు విలాసవంతమై జీవితాన్ని వీడి తన భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.
గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాకేశ్ సురానా. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
" డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు. మనమేంటి అని గుర్తించడమే జీవితం పరమార్థం. మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు. మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్, మనీశ్ సాగర్‌తో గడిపినప్పుడు తెలుసుకున్నా. నా భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంది. నా కుమారుడు కూడా నాలుగేళ్ల నుంచే ఇదే మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడు. "